Monday, 19 January 2026

తడి నయనాలు

 సహృదయ సాహితి, విశాఖపట్నం 46వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయి కవితల పోటీకి పంపిన కవిత

శీర్షిక : " తడి నయనాలు "



ఎదురుగా ఓ మనిషి...

నయనాలు తడిలో బాగా  నానినట్టున్నాయ్..


ఒంటి కాలు కదిపితేనే కదిలే

మూడుచక్రాల జీవితపు బండి

ముందుకెల్లనని మొరాయిస్తున్నట్టుంది 


పంటిబిగుతున చిక్కిన పెదాలు రోషంగా 

రోదించనని వారిస్తున్నట్టున్నాయ్ 


బరువెక్కిన ఆ గుండె దరువును తగ్గించాలనే 

తపన నాలో ఆ మోముపై చిందే చిరునవ్వును చూడాలని తహ తహ లాడుతుంది


ఓ మారు మాట కలపనా..

పలకరింపు ఊరటనిస్తుందేమో!

భుజంతట్టి పక్కన నిలబడనా..

భరోసాగా ఉంటుందోయేమో?


అడుగు ముందుకేసే ధైర్యమే రావడం లేదు 

కన్నీరునే తుడిచేసేంతా కాసులు నాతో లేవు


ఓ రిక్షా! అనగానే


మెడనున్న కండువతో ముఖం తుడిచాడు 

అద్దం వైపు చూసుకొని ఓ నవ్వు నవ్వాడు 

వస్తున్నా సారంటూ ఆప్యాయంగా పలికాడు 

పని ఒప్పుకొని పాడుకుంటూ వెళ్ళిపోయాడు



సాటి మనిషి నొప్పిని చూడగలిగినా

ఓదార్చలేని నిరుపేదలుగా.. ఓర్చుకుంటాడులే అనుకునే నిస్సహాయకులుగా..నాలాంటి వారే

సమాజంలో ఎక్కువవుతున్నారనే బాధే మిగిలింది లోలోన..!



✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

No comments:

Post a Comment