Thursday, 18 December 2025

ఓ మనిషీ!

 కష్టమని కన్నీరూ విడిచి  

హామీలతో సాయమడిగి  

ఏరు దాటాక ఆప్తుడి అప్పు

సంగతి వదిలేసే ఓ మనిషీ!

మంచిని వెలివేస్తే కాలం కనికరమే 

లేని కరువై కాటు వేస్తుందేమో !

 


కొలతలు లేని కాసులను

పరిమితులు మరచి

గొప్పలకి అలవాటుగా 

ఎదజల్లాకా ఓ మనిషీ!

కాదు కాదు కుదరదని 

కొత్త కథ రాస్తే 

ఆశ ఊరుకుంటుందా!

 


నరము లేని నాలుక

నాజుగ్గా నాణ్యతలేని 

మాటలను మూటలు 

కడుతుంటే ఓ మనిషీ!

తోలు కప్పిన ఎముకల గూడు

ఎంత మందికి హక్కుగా మారుతుందో !


 

సాలీడు గూడులా 

క్రమ వరసలో

ఆశల వలయాలను 

అల్లుకునే ఓ మనిషీ!

ప్రయత్నమే లేని ప్రయాస

ఏమి సాధించి పెడుతుందో ! 



నిజానికి విలువుందనే 

నమ్మకాన్ని నిత్యము 

మాయ చేసే అబద్ధపు 

సమాజంలో ఓ మనిషి! 

ఏ జట్టు కడతావో !

ఏ గట్టున నిలుస్తావో !

 


నిబద్ధత లేని కష్టం

నిలకడలేని మనస్తత్వం 

కలలను నెరవేర్చదని 

తెలిసిన ఓ మనిషి!

గమ్యమేంటనే ప్రశ్నకు

సమాధానం ఎలా చెప్తావో 

 


@ప్రేమ్ సాగర్ కోటపూరి (✍️అనిర్వ✍️)




Wednesday, 10 December 2025

పరిచయం లేని ఓ రోజు

 తపస్వి మనోహరం ప్రత్యేక e - సంకలనం కొరకు


 అంశం : న్యూ ఇయర్ 


రచన: ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


 శీర్షిక: పరిచయం లేని ఓ రోజు


దూరమైన నిద్రను కంటికి దగ్గర చేస్తూ మౌనంలో ముంచిన మాటలకు ఆశలకు నూతనత్వమనే రెక్కలు జోడించి ఉత్సాహాన్ని అలంకరించి అదుపు హద్దుల్లేని విహారయాత్రే జీవితమన్నట్టు 


గుండె దిగువున బరువుగా దాగిన గతం గోడలాగా నిలబడి గొడవే చేస్తున్నా హుందాగా వీడ్కోలు పలికేసి ఉత్తేజాన్ని ఆకర్షించే ఉషోదయాల పల్లకికై వ్యూహామే సిద్ధమన్నట్టు 


కొత్త ప్రణాళికా నిర్ణయాలతో పట్టు విడుపులతో చేసే ఆవిష్కరణలతోనే విలువైన విజయమని నమ్మకాన్నిచ్చే పరిచయం లేని ఓ రోజు కోసం చూసే ఆశాజనక హృదయమే బలమన్నట్టు


వత్సరాల మార్పుల గోల మారే తేదీలలో కాక పని తీరులో వృద్ధి వాగ్దానాలలో నిలపాలని జ్ఞాపకాలకు అనుభవాలకు కృతజ్ఞత భావాన్ని ఆపాదించి నూతనసంవత్సరాన్ని స్వాగతించాలి


@ ప్రేమ్ సాగర్ కోటపూరి (అనిర్వ)



ఈ కవిత నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను

Monday, 17 November 2025

రంగుల చొక్కా

 రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : రంగుల చొక్కా


నులు పోగులేకుండా మొదలైన జీవితానికి 

ఎన్ని బంధాలో...ఎన్నెన్ని బంధకాలో...


ప్రతి భావోద్వేగం ఓ రంగుల కప్పేస్తుంటే అందుకు తగ్గ ప్రవర్తనే ప్రతిబింబిస్తుంది 


సహజత్వమే కోల్పోతూ మాటలతో చిచ్చు పెడుతూ చేతలతో యుద్ధం చేస్తూ మనిషిని మనిషిగానే ద్వేషిస్తూ కొత్త గీతాన్నే ఆలపిస్తుంది


సమాజంలో తులసి మొక్కలకు సైతం గంజాయి రంగు పులుమి రాక్షస నైజంతో విడకొట్టి చలి కాచుకుంటుంది


స్వప్రయోజనాల దాహానికి స్వయంప్రకశముకై శ్రద్ధను మరిచి విరుద్ధ విన్యాసాలు జోడించి వినాశనానికి పునాదులేస్తుంది 


వ్యక్తిత్వ వికాసం వికారాల హోయాలు పోతూ సున్నితత్వమే విడచి విచక్షణలేని వివరణలా  నిలబడి విమర్శిస్తుంది


ఇచ్చి పుచ్చు కోవడమే చచ్చుబడిపోయి రంగు కాగితాల ఆటలో పద్మవ్యూహమే పాఠమైపోయి కుప్పగులుతుంటే పాపభీతిని పెంచుకుంటూ కుంగిపోతుంది


ఓ మనిషి!


రంగు చొక్కలెన్నున్నా 

అరువు తీరిన శరీరం

వాటిని అడగాలేదు! 

ఆ పై తొడగునూ లేదు!


శక్తున్నంత వరకే సామర్థ్యం

సమయమున్నంత వరకే ప్రయాణం 


మర్మము తెలుసుకోలేని 

మాయలో మరవకు సత్యం

ప్రతీది అసంపూర్ణం!

కాదేదీ శాశ్వతం!



✍️అనిర్వ✍️

ప్రేమ్ సాగర్ కోటపూరి

Thursday, 13 November 2025

వారసులం - వారధులం

 తపస్వి మనోహరం e book కొరకు


అంశం : బాలల దినోత్సవం

 

రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

తేదీ : 08-11-2025

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా 


శీర్షిక: వారసులం - వారధులం


వారసులం మేము వారధులం

రేపటిని నిర్మించే ఆశాజీవులం 

అమ్మ నేర్పిన నాన్న చూపిన లోకం

తీరూకు ఆలోచించి భయపడం


అల్లరన్నది మాకే సొంతం 

ఆపమన్నా ఆగని వీరులం 

అవ్వా తాతలకు ఆనందాన్నిచ్చే

ఆరోగ్య శాఖ మంత్రులం 


ఉన్న క్షణముని తూకం వేయని

స్వేచ్ఛా సమయ ప్రేమికులం

తొలకరి చినుకులలా పలుకులను 

చల్లే మాటల మాంత్రికులం


కళ్ళు కట్టుకుని కలలను కనం

కన్నీళ్ళను దాటే నవ్వు మా బలం

పడిన లేచిన ముందడుగు

వేయడమే మా నైజం


@ ప్రేమ్ సాగర్ కోటపూరి (అనిర్వ)

ఈ కవిత నా సొంత రచనని హామీ ఇస్తున్నాను

దివ్వెల పండుగ – దీపావళి

 తపస్వి మనోహరం e – book కోసం 


అంశం : దీపావళి 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక : దివ్వెల పండుగ 


నింగికెగసే తారా జువ్వల వెలుగుల జల్లులు నేలను తాకుతూ తన్మయత్వాన్ని కేరింతల చిరునవ్వులను హత్తుకునే ఆశీర్వాదాల బహుమతిగా బహుకరిస్తుంటే...


వయస్సు ఉచ్చులో చిక్కక సంతోషాల తోరణాలను దీపాలతో అలంకరించి చీకటి భారాన్ని త్రుంచేసే ఆనందహేల అందరి మనస్సులలో కొత్త గీతాన్నే ఆలపిస్తుంటే...


మువ్వలు లేని పాదాల రవళి ఊపిరిగా చిలకరిస్తూ మంచికున్న విలువలను గెలుపుగా ఊహించలేని అనుభూతిని ఊరించే హుషారుగా మురిపిస్తుంటే...


బ్రతుకు గుడిలో దీపపు వెలుగులోని రంగులు ప్రేమ స్నేహం శాంతి కి ప్రతీకలై ఇంటి ముంగిళ్లలో కలిసి మెలిసి నిత్య నూతన అస్త్రముల వస్త్రము విజయ నృత్యములా కనిపిస్తుంటే....


హృదయాలు నిండుగా అలుముకొని పులుముకొని ఒకరితో ఒకరమని చేసుకునే దివ్వెల పండుగే మన దీపావళి


✍️అనిర్వ✍️

ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను


@ప్రేమ్ సాగర్ కోటపూరి

Saturday, 20 September 2025

ఎన్నెన్నో జన్మల బంధమేమో

 అనంత సాహితీ వేదిక 

తేదీ : 19/9/2025 ( శుక్రవారం) 


అంశం : ఎన్నెన్నో జన్మల బంధం


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక : ఎన్నెన్నో జన్మల బంధమేమో



నిన్ను చూసిన క్షణం మరువలేనిదిగా నిలిచేలా నన్ను అనువణువు అల్లుకుపోయినా మధురమైన జ్ఞాపకమే నువ్వు... 


కౌవింతలా అనిపించి గిలిగింతలే కలిగేలా నా తలపులను నీ వైపుకే లాగేసుకున్న అయస్కాంత మహిమలా ఉందే నీ నవ్వు... 


అందరు నాతోనే ఉన్న నీ కనురెప్పల కదలికలు నాతో మాటకలపగలవా అని కొంటెగా ప్రశ్నలు సందిస్తుంటే నిశ్శబ్ద ఒప్పందము కుదిరినట్టుగా నిలిచింది నా నవ్వు....


వయస్సోచ్చాక ఎన్నో ఆకర్షణలు పరిగెత్తించిన మనస్సున అలసిపోయిన ఎంతో మందిని దాటుకొని నిన్ను చేరుతున్న ఆ అనుభూతికి వర్ణనేలేని హాయివి నువ్వు...


బంధుజనమంత వింతగా చూస్తుంటే అమ్మనాన్నల పిలుపు ప్రతిధ్వనిస్తుంటే వినపడకుండా నా చుట్టూ కమ్ముకుని నా స్థితి గతి తప్పేలా చేసినా మాయవే నువ్వు...


నచ్చిందా నచ్చిందా అనే అరుపులు గుండె వేగాన్ని తట్టిలేపుతుంటే ఏమి చెప్తానోనని నీ చేతివేళ్ళు కంగారులో చీరకొంగుకే ముడతలు పట్టిస్తుంటే నీ మనస్సు నన్ను కోరుకుంటుందని మురిసిపోయాను ఆశ్చర్యంలో ఎలా నన్ను నమ్ముతుందని ఎలాంటి భరోసా తనకు కలిగిందనే ఆలోచనే తెలిపింది నిజమైన ప్రేమంటే ఏంటని!


నిన్ను చూసినది ఇదే మొదటిసారని నాకు తెలుస్తున్నా ఒప్పుకోలేకపోయాను మన బంధం ఈ జన్మలోనిదని...ఎన్నెన్నో జన్మల బంధమేమో భగవంతుడే తెలిసి తెలిసి రాసిన పెళ్లి పుస్తకం మనదేనేమో!


✍️అనిర్వ✍️


ఇది నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను

@ప్రేమ్ సాగర్ కోటపూరి

Thursday, 18 September 2025

ఎవరు కట్టగలరో ఖరీదు

 అనంత సాహితీ వేదిక

తేదీ : 17/9/2025( బుధవారం) 


అంశం : ప్రాణం ఖరీదు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక : ఎవరు కట్టగలరో ఖరీదు


విచిత్రమైన మాయా ప్రపంచంలో

అర్ధమేకాని వింతైనా ప్రశ్న యెకటి ఎదురుచూపుల దాడి చేస్తుంది విలువే తెలియని సమాధానంకోసం


ఎవరికి తెలుసు ఏ తూకం తేలుస్తుందో ఏలాంటి రంగు కాగితాలకి నిలుస్తుందో చెప్పలేని హాస్యాస్పదమైన ఆలోచనలకి రూపమే ప్రాణం ఖరీదు



పురుడు పోసుకునే బిడ్డకై తల్లి చేసే ప్రాణసహితమైన ప్రయత్నమే ఖరీదూ 


కడుపు నింపుకునే ఆరాటంలో పీకలు తెగి కొట్టుమిట్టాడు తున్నప్పుడు ఆకలే ఖరీదు


వాహనాల వేగానికి రెప్పపాటులో స్మశానంలో భాగమై బంధాలే విడిచేప్పుడు నిర్లక్ష్యమే ఖరీదు


ఒడ్డున పడాలని చావు బ్రతుకు ఆటలో గెలవాలని హింసలు పడుతున్నప్పుడు  భేరసారాలాడే ఆశే ఖరీదు


బలాత్కారాల భారిన పడి మౌన రోధనలో బలికాబడుతున్నప్పుడు మరిచే విచక్షణే ఖరీదు


అన్నీటికి విలువకట్టే మానవ మృగం లోన చేరి ఆడిస్తుంటే

సర్వం కోల్పోతున్నా నోరు కదపలేని  సంగ జీవులం అందుకు మృతిమయమైన మనస్సాక్షే ఖరీదు


అడిగినా అరిచినా వెలకట్టలేని గొప్పదిగా విలువివ్వలేనంత తేలికగా చూసే అరుదైన అద్భుతం ఓ ప్రాణం ఎవరు కట్టగలరో ఖరీదు



✍️అనిర్వ✍️

ప్రేమ్ సాగర్ కోటపూరి


ఇది నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను 

@ ప్రేమ్ సాగర్ కోటపూరి

ధీరత్వమనే ఒడ్డున సారధిగా మారి

 అనంత సాహితీ వేదిక 

తేదీ : 15/09/2025 (సోమవారం) 


అంశం: ఒడ్డునున్న చెట్టు యేటిలో తన నీడ చూసుకుని కొమ్మజెడలో పూలు సర్దుకుంది


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక:ధీరత్వమనే ఒడ్డున సారధిగా మారి


అందమైన జీవితంలో అందాన్ని ప్రశ్నించే రోజులొచ్చినా ఆనందాన్ని కబలించే పరిస్థితులొచ్చినా క్రుంగేదే లేదని సడలని నమ్మకమే బలమని చెప్పగలిగే నిజమైన ధీరత్వమనే ఒడ్డున నిలిచి ఒక్కసారి చూడు...


అందివచ్చిన అవకాశాలు నైపుణ్యాలు మొక్కకు తడిలా సర్వదా ఎదగనిచ్చిన చేరివచ్చిన స్థితి స్థిరమనే భ్రమలో నేనే అనే ఆలోచనకు హెచ్చించు స్వభావాన్ని జోడించడం మానేసి... 


దాటి వచ్చినా మధ్యతరగతి బ్రతుకులలో మునగలేక తేలలేక  ప్రవాహములో కొట్టుకొనిపోలేకా తఅభద్రతభావంతో అడుగడుగునా పడుతూలేస్తూనే జీవనంసాగించిన ప్రతి అడుగు గుర్తుచేస్తుంది నీకు చేరే మెతుకుని... 


విడనాడని ప్రియనేస్తంగా నీడ నేనున్నా ముందు భయపడకంటది వెనకనే నేనుంటా ఆగకని చెప్తది బలాన్ని పరిచయం చేసే జ్ఞానిలాంటిది బలుపుతో ఎగిరిపడితే గాలి తీసే సూదిలాంటిది


కళ్ళ ముందు ఎన్నో కథలు కోటలు చూసాయి కాటికి చేరాయి నీ వంతు రాక మానదూ హెచ్చరించక ఆగదు 


అనుభవం నేర్పిన జ్ఞానాన్ని గతంలో నడిచిన నీ రుపాన్ని మరువక సాగాలి వెతుకుతూ కొత్త దారుల్ని సారధిగా మారి తయారు చెయ్యాలి సాధకుల్ని...


✍️అనిర్వ✍️(కలం పేరు) 



ఇది నా స్వీయ రచన, అని హామీ ఇస్తున్నాను

@ప్రేమ్ సాగర్ కోటపూరి

Monday, 15 September 2025

చిక్కటి చిరునవ్వే

 తపస్వి మనోహరం అంతర్జాల పత్రిక కొరకు... 

విభాగం :  చిత్ర కవిత.

తేది.     :  13- 9 - 2025


అంశం.  :  ఐచ్చికం 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079

శీర్షిక : చిక్కటి చిరునవ్వే 


సమస్యల సమాధానాల సమ్మేళనమైన మనిషి జీవితంలో చిక్కుమూడులు ఎన్నున్నా చిక్కటి చిరునవ్వే ఆయుధము కాగలిగితే దాసోహమనక మానరు నీలోని ధీరత్వాన్ని చూసి ఈ జనులే! 


ప్రతి చింతకి చిరాకుకి అర్ధంలేని ఆందోళనే ఆధారమైతే ఎవరికి ఎవరనే లోకంలో ఎదురుచూడకు స్వాంతన పొందే క్షణాలు కోసం నీ నిరీక్షణకు ఉండదు అంతమే! 


గెలుపోటములు భాగమైన బ్రతుకుపోరులో ఎగసి ఎగసి పడి దూకే అలలే ప్రోత్సాహాన్నిచ్చే ఉత్సాహమైతే అడ్డుపాటు లేదు నీ గమ్యం సంతోషమే! 


అనచాలని ఎందరనుకున్నా

స్థితి గతులే క్రుంగతీస్తున్నా

ఆవేదనవర్గంతో తీరు ఏదైనా

ఎగరాలనే ధృడచిత్తమే నీదైతే

 అంతర్గతమంత ఆనంద నిలయమే!


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి



ఇది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను.

@ ప్రేమ్ సాగర్ కోటపూరి

Monday, 8 September 2025

మత్తుకి రూపాలే వేరు!

 అనంత సాహితీ వేదిక 

తేది : 7/9/25


అంశం : మధు చషకం


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక : మత్తుకి రూపాలే వేరు! 


మధురమైన మాటలలోని కైపుకు 

అలవాటుపడిన మనుష్యులెవ్వరూ

అబద్దాన్ని ఆహ్వానించినంతగా నిజాన్ని స్వీకరించలేరు! 


అపోహలనే దుప్పటిని కప్పి రెప్పల మాటున ఊహగానాల కోటనే కట్టే అజ్ఞానపు మేథావులనెవ్వరూ ప్రేరేపించలేరు! 


విలాసవంతమైన జీవితం కోసం అనర్ధాల ఆలోచనల తోడు ఆశ్రయించినంత కాలం ఆకాశమందినట్టే కానీ చేతికి చిక్కదనే రుజువునెవ్వరూ చూపలేరు! 


శరీరమే అలవని పనులే కావాలనే యవ్వనానికి బాధ్యత మరిచి విచక్షణ కోల్పోయే కుర్రకారుకి పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పే జీవితాన్ని పెద్దలెవ్వరూ ఇవ్వలేరు!


మత్తుకి రూపాలే వేరు 

పని తీరు ఒక్కటే!

ఏ రూపానికి లోబడిన 

ప్రతిఒక్కరికి బ్రతుకు ఇచ్చే 

అవకాశాలు చాలానే ఉంటయి


తేరుకుంటే తీరు మారుతుంది 

లేకుంటే జీవితమే తారుమారవుతుంది. 


✍️అనిర్వ✍️

ప్రేమ్ సాగర్ కోటపూరి


ఇది నా స్వీయ రచన. 

@ప్రేమ్ సాగర్ కోటపూరి

Thursday, 4 September 2025

జీవితం ఓ నదీ ప్రవాహం

అనంత సాహితీ వేదిక

అంశం: నిశ్శబ్ద నదీ ప్రవాహం

రచన: ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079

శీర్షిక :  జీవితం ఓ నదీ ప్రవాహం


సంతోషాలను చూస్తున్నంత సేపు

ఆశించినది దొరుకుతున్నంత వరకు

మనసెప్పుడు మాటలాడదు

ఇతరులగురించి ఆలోచనే చేయదు


గాయం గట్టిదే అయితే ఒంటరిగా మిగిలిపోతుంది నమ్మకాన్నే కోల్పోతుంది


ప్రవహించే నదిని చూస్తన్నంత సేపు 

మనసుకి ఆహ్లాదంగాను ప్రశాంతంగాను ఉంటుంది ఒక అలజడి చేసే హడావిడిలో

లోలోన దాచిన ప్రతి మాలిన్యం ప్రత్యక్షమౌతుంది


ఓర్పు వహించి చూసామా

ఏమి లేనట్టు ఏది జరగనట్టు 

చాలా నిమ్మలంగా సాగిపోతుంది

బాగా గమనిస్తే మనకు ఒక గుణపాఠం చెప్పే పోతుంది


మన జీవితము ఓ నదీ ప్రవాహమే

ఎన్నెన్నో వింత అనుభవాలను

ఏమికానీ మనుష్యులను 

అర్ధంకాని మనస్సులను 

ఉద్రేకపరిచే మాటలను దిగజార్చే చేష్టలను నిలవునా ముంచే మోసాలను అనవసరపు అబద్దాలను ఇంకెన్నో అవమానాలను అవహేళనలను 

ఎదురొచ్చిన ప్రతి ఇబ్బందులను 

ఇరుకులను మనలోనే దాచుకొని 

ఎంత దూరమైన సాగగలగాలి

ఏమి జరిగిన నిశ్చలంగా నిలబడాలి

ఈ జీవితం నీకు నాకు ఓ రూపం మాత్రమే అవకాశంగా మార్చుకొని ఇతరులకు ఆధారమైతే అంతకుమించి ఆదర్శమైతే ఎలా ఉంటుందో మన కథ!


@ప్రేమ్ సాగర్ కోటపూరి

✍️అనిర్వ✍️

Wednesday, 3 September 2025

ధృడమైన మనస్సే" మిన్న

 ఎదురుగా ఓ మనిషి నయనాలు తడిలో బాగా  నానినట్టున్నాయ్ కదిలిస్తే పట్టలేనంతగా కన్నీరూ జారిపోయేలా ఉన్నాయ్


ఒంటి కాలు కదిపితేనే కదిలే మూడుచక్రాల జీవితపు బండి ముందుకెల్లనని గట్టిగానే మొరాయిస్తున్నట్టే కనపడుతుంది 


పంటిబిగుతునా చిక్కిన పెదాలు 

రోషంగా రోదించకూడదనే సంకేతాలను సూచిస్తున్నట్టు వినపడుతుంది


బరువెక్కిన ఆ గుండె దరువును

తగ్గించాలనే తపన నాలోనే

నాట్యమాడుతూ తన మోముపై చిందే చిరునవ్వును చూడాలని తహ తహ లాడుతుంది


ఓ మారు మాట కలపనా! పలకరింపు ఊరటనిస్తుందేమో

భుజం తట్టి పక్కన నిలబడనా!భరోసాగా ఉంటుందోయేమో


అడుగు ముందుకేసి తెలుసుకుందామంటే ధైర్యమే చాలడం లేదు కదిలించి కన్నీరునే తుడిచేసేంతా కాసులు నాతో లేవు


ఓ రిక్షా! అనే పిలుపు వినగానే

మెడనున్న కండువతో ముఖం తుడిచాడు అద్దం వైపు చూసుకొని ఓ నవ్వు నవ్వాడు వస్తున్నా సార్ అంటూ ఆప్యాయంగా పలికాడు పని ఒప్పుకొని పాడుకుంటూ వెళ్ళిపోయాడు


"ధృడమైన మనస్సే" మిన్నని చెప్పకనే చెప్పాడు


సమాజంలో సాటి మనిషి నొప్పిని చూడగలిగినా ఓదార్చలేని నిరుపేదలుగా ఓర్చుకుంటాడులే అనుకునే నిస్సహాయకులుగా నాలాంటి వారు ఎక్కువైనారని బాధగా ఉన్నా అతని తెగువకు గర్వంగాను పాఠం అర్ధమైనాక సిగ్గుగాను ఉంది. 


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

Tuesday, 2 September 2025

ఓ రిక్షా!

 రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక


ఎదురుగా ఓ మనిషి నయనాలు 

తడిలో బాగా నానినట్టున్నాయ్

కదిలిస్తే పట్టలేనంతగా కన్నీరూ

జారిపోయేలా ఉన్నాయ్! 


ఒంటి కాలు కదిపితేనే కదిలే 

మూడు చక్రాల జీవితపు బండి

ముందుకెల్లనని గట్టిగానే 

మొరాయిస్తున్నట్టే కనపడుతుంది 


పంటిబిగువునా చిక్కిన పెదాలు 

రోషంగా రోదించకూడదనే సంకేతాలను సూచిస్తూన్నట్టు వినపడుతుంది


బరువెక్కిన ఆ గుండె దరువును

తగ్గించాలనే తపన లోలోనే నాట్యమాడుతూ తన మోముపై చిందే చిరునవ్వును చూడాలని తహా తహా లాడుతుంది


కదిలిస్తే ఏమడుగుతాడో

కాదంటే ఏమైపోతాడో

దయ ఉన్నా ధైర్యమే చాలడంలేదు హృదయ వేదన నిలదీస్తున్నా కన్నీరునే తుడిచేసేంతా కాసులే లేవు ఓదార్పు చాలులే అనుకుందామంటే కష్టం నాదికాదూ

కష్టమో నష్టమో ఆ వివరాలేమి తెలియవు



ఓ రిక్షా అనే పిలుపు వినగానే

మెడనున్న కండువతో ముఖం తుడిచాడు అద్దం వైపు చూసుకొని ఓ నవ్వు నవ్వాడు... వస్తున్నా సార్ అంటూ ఆప్యాయంగా పలికాడు



బాధను కాకులకేశాడోయేమో

పని ఒప్పుకుని పాడుకుంటూ వెళ్ళిపోయాడు

ధృడమైన మనస్సే మిన్నని చెప్పకనే చెప్పాడు


సమాజంలో సాటి మనిషి నొప్పిని చూడగలిగిన ఓదార్చలేని నిరుపేదలు ఓర్చుకుంటాడులే అనుకునే నిస్సహాయకులు ఎక్కువైనారని బాధగా ఉన్నా


అతని తెగువుకు గర్వంగాను

పాఠం అర్ధమైనాక సిగ్గుగాను ఉంది




✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

Saturday, 30 August 2025

అమ్మ మరిచిన ప్రేమపాశం

 శీర్షిక : అమ్మే మరిచిన ప్రేమపాశం


నేను చేసిన నేరమేమిటమ్మా? 

నవ మాసాలు మోసిన నీకే భారమైతిని


నేను చేసిన పాపమేమిటమ్మా? 

నను మురిపించే నీ ఒడికే దూరమైతిని


ఆలుమగల వలపు ఆటలో పూసిన పువ్వునే కదమ్మా ? 

అసహ్యానికి నేను ఎట్లు కారణమైతిని? 


కన్నీరుకే తల్లడిల్లే తల్లివే కదమ్మా

చనుపాలు తాగిన బిడ్డడు పై ఎలా కన్నెర్ర చేసితివి



శరీరేచ్ఛల దాడిలో నీవు భాగమైతివో లేక బానిసవైతివో

కఠినమైన నిర్ణయంతో నన్నే 

మరణ కౌగిలికి అప్పగించేస్తివి



నేను చేసిన నేరమేమిటమ్మా? 

నేను చేసిన పాపమేమిటమ్మా?

ఒక రోజు

 ఓ నేస్తమా !


రోజన్నది చిన్నదికాదు కనులు మూసుకొని మరిచిపోడానికి 


రోజన్నది అంతము కాదు

ఆశలతో సాగకుండ ఆగిపోడానికి


రోజన్నది ఓ అయోమయం

భయంలోనే బ్రతికే వాడికి


రోజన్నది ఓ అవకాశం

ప్రయత్నించాలనుకునే వాడికి


రోజన్నది ఓ ఆయుధం 

కొత్తగా నేర్చుకుంటున్న వాడికి


రోజన్నది ఓ అద్భుతం

పోరులో నిలచి గెలిచే వాడికి


నేర్చుకున్నది ఎంతని 

ప్రశ్నించుకునే వాడు

నేర్చుకోవాల్సింది చాలానే

ఉందని గ్రహించిన వాడు


అయోమయాన్ని వదిలి

అవకాశాన్ని చూస్తాడు

ఆయుధాన్ని చేపట్టి

అద్భుతాన్ని సృష్టిస్తాడు 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079

నీడ

 మనల్ని విడనాడని

ప్రియనేస్తమే నీడ

ముందు నేనున్నా

భయపడకంటుంది

వెనకనే నేనుంటా

ఆగకని చెప్తుంది

అంతా బాగుంటే

లోలోనే ఉంటుంది



బలాన్ని పరిచయం

చేసే జ్ఞానిలాంటిది

బలుపుతో ఎగిరిపడితే 

గాలి తీసే సూదిలాంటిది


నీడ కూడ నిలదీస్తోంది

గురువుల గుణమే-గౌరవ నిలయం

 తపస్వి మనోహరం పత్రిక కవితల పోటీల కొరకు... 


అంశం:- ఉపాధ్యాయులు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు: కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక:-

గురువుల గుణమే-గౌరవ నిలయం



చింతలు చిరాకులు చెంతనున్నా

చిరు దరహాసంతో ప్రేమానురాగాలు

కురిపించగల దయా హృదయులు "గురువులు"


విలువలు మరిచి వ్యవహరించే

నవనిర్మాణికుల పాలిట హద్దుమీరని బెత్తమై 

దండించగల  జీవితపు శిల్పులు "గురువులు"


అక్షరయజ్ఞంలో సమానత్వమును

సామరస్యమును సూత్రాలుగా ఆదరించి నిష్టగా ఆచరించగల  ప్రధాన అర్చకులు "గురువులు"


పేగు బంధమే లేని చిన్నారులతో

అమ్మ ప్రేమలా వింతగా అల్లుకొని

నడిపించగల దైవాంశ సంభూతులు "గురువులు"


సమస్యల తాలుకు చర్యలకు సడలక బెదరక వివేకముతో శాంతిని సమాధానాన్ని జోడించగల

మేథాసంపన్నులు "గురువులు"


అజ్ఞానం కమ్మిన చీకటి బ్రతుకులలో

అర్ధవంతమైన అనుకూల ఆలోచనలను వెలిగించగల జ్ఞాన జ్యోతులు "గురువులు"


గురువుల గుణమే-గౌరవ నిలయం

గురువుల రణమే-అనిర్వచనియం


✍️అనిర్వ✍️ (కలం పేరు) 

@ప్రేమ్ సాగర్ కోటపూరి


ఇది నా స్వీయ రచన, ఈ పోటీ కొరకు రాయబడినది.


@ ప్రేమ్ సాగర్ కోటపూరి

9542000079

Monday, 18 August 2025

ప్రతిసారి...చివరిసారి

 అనంత సాహితీ వేదిక

18/08/2025

అంశం : చివరిసారిగా


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా


శీర్షిక : ప్రతిసారి...చివరిసారి



అలవాటులో పొరపాటుగా చేసే అప్పులకు తప్పులకు హామీ ఇచ్చేలా చెప్పే ప్రియమైన మాట

ఇదే చివరిసారని ఇకమీదట చేయబోనని... 


మనిషి ఒక ఆశాజీవి - ఆకలికి అల్లాడి పోతాడు - ఆశలకి అతుక్కుపోతాడు - అవమానానికి రేగిపోతాడు - అభిమానానికి ఊగిపోతాడు... 


బాధ ఏదైన భారం ఎంతైనా

పడుతూ లేస్తూనే ధీమాకే భీమాల సాగిపోతాడు... 


పాపం మనిషి - అంతా నాదని అనుకునే లోపు ఏమిలేకుండా మిగిలిపోతాడు - ఏమి లేదని చింతించే స్థితిలో అన్నీ క్రమంలో 

పొందుకుంటూంటాడు - అదే ఊపులో పోగొట్టుకుంటూంటాడు... 


ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి ఇదే చివరిసారి కావాలని వేడుకుంటూ పొడుకుంటాడు - తిరిగి లేచి బ్రతుకు పోరులో పరిగెడుతూనే ఉంటాడు - నవ్వినా ఏడ్చినా వచ్చే కన్నీళ్ళ మధ్య నలిగిపోతుంటాడు..


చివరి శ్వాస విడిచే దాక - చిరునవ్వుని ముసుగుగా వేసుకొని మూరిసిపోతుంటాడు - మాటలతో మాయలే చేస్తూ ప్రతిసారి చివరిసారని - లోకతీరునే అనుసరిస్తూ బ్రతికేస్తూంటాడు... 


 


✍️అనిర్వ✍️( కలం పేరు) 

@ ప్రేమ్ సాగర్ కోటపూరి

9542000079

నాటి నైజం లేదిక్కడ!

 రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079



శీర్షిక: నాటి నైజం లేదిక్కడ! 



నాడు స్వేచ్ఛా జీవిని

స్వచ్ఛతకు సాక్షిని

ప్రేమకు అర్హుడిని

స్నేహనికి ఆధారాన్ని

అభిమానానికి ఆలోచనని

ఆత్మీయతకు ఆరాటాన్ని

బాధ్యతకు సైనికుడిని

భరోసాకు నాయకుడిని


సమాజ హితముకై 

నేడు ఓ సమీదనై


గుర్తు చేస్తున్నా గతాన్ని

వినిపిస్తూ నా గళాన్ని...



అవసరాల వేటలో 

అల్లాడి పోతున్నా

అభాగ్యుల గాధ వింటున్నా! 


అభివృద్ధి మోజులో పడి 

నలిగిపోతున్న అవివేకుల జాడ చూస్తున్నా!



పచ్చ తోరణాల పట్టు చీర చుట్టిన

అడివితల్లి అందమెక్కడా? 

అద్దెలిచ్చి హద్దు లెట్టుకున్న పార్కులలో సందడే ముద్దు ఇక్కడ! 


అలవాట్లే ఆరోగ్యంగా గడిపిన

ఆ ఆనందమెక్కడా? 

ఆస్తులమ్ముకుని సేద తీరే

ఆసుపత్రుల గోలే ఇక్కడ!


అరుగులెంట పొరుగువారితో 

కోసుకున్న పంట లెక్కడా? 

అరగంట కూడ ఓపిక పట్టలేని

చరవాణి చెరలోని తరములిక్కడ! 


గురువుల సేవలో నేర్చిన 

సంస్కారాల చదువులెక్కడా? 

కాసుల త్రాసులో వ్రేలాడే 

చిల్లర సుంటలే ఇక్కడ!


సమస్యల భారాన్ని తలదన్నే

సన్నిహితుల తోడెక్కడా? 

అరువులిచ్చి అస్తమిస్తున్నా 

చెలిమి తాలుకు చితులే ఇక్కడ! 


కంచాలు మంచాలే లేని ఆకలి నిద్రలు తీరిన వారెక్కడా? 

హంగుల విందుల చిందులలో 

అజ్ఞానపు అర్ధనగ్న చిత్రాలే ఇక్కడ!


ఆత్మాభిమానంతో పేదరికాన్నే 

ఎదిరించిన తలిదండ్రులెక్కడా? 

ముదిమి చాయల వంచనలో

ఆశ్రమ ఆశ్రయాల ప్రేమలే ఇక్కడ!



మాటే మంత్రంగా మమతే ప్రాణంగా  

మసులుకున్న తీరెక్కడా? 

అడ్డదారి హెచ్చులలో చిక్కి 

చంపుకునే జీవనశైలిక్కడ!



ఉన్నంతలో కొండంతగా 

చాటిన మానవత్వమెక్కడా? 

సంపదకై పోటీతత్వంలో 

సాటితత్వమే మరిచే మనుషులిక్కడ!



ఎందుకోసమని ఆరాటం 

ఏమున్నదని ఆర్భాటం

ఎంత ఎత్తు ఎగిరిన

ఆరడుగుల శూన్యంలో

చేధించలేము మరణాన్ని! 


@ప్రేమ్ సాగర్ కోటపూరి

✍️అనిర్వ✍️(కలం పేరు)

Thursday, 26 June 2025

స్థిరత్వం కోల్పోకు

భయానికో బద్దకానికో

నీవు బానిసవు కాకు

స్థిరత్వాన్ని కోల్పోకు.. . 


భయానికో బద్దకానికో

నీవు బానిసవు కాకు

స్థిరత్వం లేని బ్రతుకుకి

చిరునామాగా మిగలకు





Sunday, 25 May 2025

పోటీతత్వం

 మనలో దాగిన సామర్ధ్యం ఉన్నతంగా

 ప్రదర్శించబడాలంటే పోటీతత్వమైన 

ఉండాలి లేదా బలమైన పోటీలోనైన ఉండాలి


@ప్రేమ్ సాగర్ కోటపూరి

26/5/25

Sunday, 4 May 2025

దుఃఖాన్నే తర్జుమా చేస్తే సంతోషం

 అంశం : దుఃఖపు తర్జుమా 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా


శీర్షిక : దుఃఖాన్నే తర్జుమా చేస్తే సంతోషం


ఎవరికి ఎవరు ఏమికారనే భావముతో ఎవరిని నమ్మాలో తెలియని అయోమయముతో ఎవరికి ఏమి చెప్పుకుంటే ఏమౌతుందోయనే సందేహముతో ఎవరిని పట్టించుకోకుండా బ్రతికేయాలనే నిర్ణయముతో 


నేటి సమాజములోని మనుష్యులు ఎవరికి వారేనన్న గొప్ప నినాధముతో హద్దులను గీసుకొని 

పరిమితులు రాసుకొని


సువాసనే లేని కాగితపు పువ్వుల్లాగా అనురాగమే మరిచిన అనుబంధాలు అందంగా ముస్తాబ వుతుంటే - దుఃఖపు తాలుకు చాయల్ని మాటలతో దాచేయాలని విస్తృత ప్రయత్నమే చేస్తుంటే - బాధించే బంధకాలను చిరునవ్వుతో మౌనంగా దాటి వేయవచ్చని సర్దుబాటు చేసుకొని మరి సర్ది చెప్పుకుంటూంటే


అబద్దాలు నిలబడి యుద్దాలు చేస్తాయా? నమ్మకాలను నిలబెట్టే విజయాలను అందిస్తాయా?


పగిలిన అద్దమువలె గాయపడిన మనస్సులను నిర్లక్ష్యమే చేస్తుంటే-నిశబ్దపు దాడిలో అహంకారపు చర్యలే ప్రశ్నిస్తూ నడిపిస్తుంటే-బంధాలను బహిష్కరించుకుంటూ దూరంగా పారిపోతుంటే


ఒంటరితనానికి విరుగుడు  దొరుకుతుందా? ఆత్మీయతకు సంతృప్తి లభిస్తుందా?


అందరిలో ఆనందంగా ఏకాంతములో ఏకాకిలా భావిస్తూ జీవించే సగటు మూర్ఖులారా-మన బ్రతుకులకు బంధాలే బలం- నటనలను వీడి జీవించడం నేరవండి - ప్రతి దుఃఖంలోని చీకటి కోణాన్ని హుందాగా తర్జుమా చేస్తూ సమాధానంతో సంతోషంగా బ్రతకండి


✍️అనిర్వ✍️( కలం పేరు) 

@ ప్రేమ్ సాగర్ కోటపూరి

9542000079

Sunday, 27 April 2025

ఓ విద్యార్ధి

అంతర్జాతీయ కవితా దినోత్సవం

సందర్భంగా

కవి సమ్మేళనం కోసం

రాసిన కవిత


అంశం : సామాజికాంశం


శీర్షిక : ఓ విద్యార్ధి! 



అక్షరాలు నేర్పిన 

లక్షణాలను నేర్చినా

కర్తవ్యమే ఏర్పడును



కర్తవ్యమే మరచిన

కథానాయకుడవైతే

ఏమి వచ్చును? 


గురువులనే హేళన చేస్తూ

చదువులనే విస్మరిస్తూ

సరిలేని స్నేహాలకే బానిసవైతే

సంస్కారం ఎలా వచ్చును? 



కొత్త వింతల భ్రమలో

కన్న వాళ్ళకే శాపమై

సమాజానికే ప్రశ్నగా మారితే 

గౌరవము ఎవరు ఇచ్చును ? 



భ్రమలోని బ్రతుకుని వదిలి

శ్రమలోని విలువను ఎరిగి

నవ నిర్మాణికుడివే కాగలిగితే


ఓటమిలే కాటు వేసిన

గుంట నక్కలే చేటు చేసిన

విజయమే దరి చేరును

ఘన కీర్తిని అదే చాటి చెప్పును 


ఈ జీవనం - జీవితం

రేపటి తరం కోసం

అక్షరమే - లక్ష్యంగా

సాగించు ప్రయాణం





✍️ అనిర్వ ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి

21/03/2025



రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

పగటి కల

 అనంత సాహితీ వేదిక 

తేది : 17/03/25

అంశం : చీకటినే చీల్చుకొచ్చిన కల


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : పగటి కల


కనుల బాసటగా

నాలోని భయం

చీకటినే కమ్మినట్టు

ఎంతో కలకలం


అందరం అందరమన్నా

మందలన్నీ మాయం

రాబోవు ముహూర్తాన

వివాహామే కాయం


ఎవరికి వారే అన్నట్టు

అంతులేని ఉత్సాహాం

ముచ్చటైన బంధుత్వంతో

ఇల్లంతా ఆహ్లాదం


అక్షరాల కూర్పులో

అందమైన కవిత

చదివానంటే చాలు

నాతోనే తన భవిత


ఏమండి అనే చిలిపి

పిలుపు కోసం

తలపులతోనే పూర్తిగా

నాకు సహావాసం


ఆస్వాదించడంలో క్రొత్తదనం

వదలనంటుంది ఏ క్షణం

తట్టి తట్టి లేపుతుంటే

ఘాటైన అనుభవం


కనులారా చూసుకుంటే

వాస్తవికతలో అయోమయం


చీకటినే చీల్చుకొచ్చినావే

నా ప్రియా చెలియలాగా

అల్లీ బిల్లి అంటూ వదిలి

వెళ్ళేనావు పగటి కలలాగా


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

19/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

నా కవిత్వం

 అనంత సాహితీ వేదిక 

తేది : 21/03/25

అంశం : కవిత్వమంటే


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : "నా కవిత్వం"


నేను నిలచిన సమాజాన్ని

అతి దగ్గరగా చూపేది


నేను పొందుకున్న అనుభూతిని

అద్భుతంగా వర్ణించేది


నేను విన్న కథలకు, బాధలకు

తెలియని ఓదార్పునిచ్చేది


నేను మరవలేని గాయానికి

హాయిని, ఉపశమనన్నిచ్చేది


నాకెదురైన సామాజిక సమస్యలకు

ప్రశ్నించాలనే గళాన్నిచ్చేది


నన్ను అర్ధం చేసుకోలేని వారికి

అభిప్రాయాన్ని సూటిగా చెప్పేది


నాలోని భయాలకు, ప్రశ్నలకు

వెతకని సమాధానమిచ్చేది


నాలోని రోదన వేదనల్లో

తోడుగా స్పందించేది


నాలోని ప్రేమను పరవశింపజేసి

ప్రణయగీతాన్ని ఆలపించేది


నాలోనే జనియించి 

నాతోనే పయనించి

నవ్విస్తూ, కవ్విస్తూ, 

మూరిపిస్తూ, మరిపిస్తూ

మాయ చేసే హృదయ 

స్పందనే నా కవిత్వం


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

22/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

బంధాల అనుసంధానం

 సద్భావన చారిటబుల్ ట్రస్ట్ &

అనంత సాహితీ వేదిక 

సంయుక్త ఆధ్వర్యంలో 


"ఉగాది కవితల పోటీ "


అంశం : అనుబంధాలు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : బంధాల అనుసంధానం


అనుకోని అతిధిగా పిండమునై

బొడ్డుతాడు తోడుగా బిడ్డనై 

అమ్మ ఒడిలోనికి చేరాను


నాన్న అనే పిలుపిచ్చే నమ్మకముతో

స్వేచ్ఛగా లోకాన్ని చూసాను


రక్తబంధమేముద్దుగా తోబుట్టువులే 

బలగముగా ధైర్యంగా పెరిగాను


స్నేహాబంధమే మద్దతుగా హితుల్ని

సన్నిహితులను పొందాను


అక్షరయజ్ఞంలో  శిష్యుడనై

గురువు నేర్పిన జ్ఞానం నేర్చాను


జంట మంత్రముతో నేను 

సంసారసాగరం ఈదాను


ఏర్పడిన బంధాలను వదలక

మరవక ఆస్వాదిస్తున్నాను


బంధాలకు భాష వేరు

భావాలకు అర్ధాలు వేరు

విధి ఆడే వింత నాటకంలో

ప్రతి పాత్రకు పని తీరే వేరు


మనస్సుకి స్వచ్ఛత కావాలి

మాటలు మర్యాదతో నిండాలి

అవసరాలలో చేయుతనివ్వాలి

కోపాలలో ఓర్పును నేర్పాలి

పాపాలకు హెచ్చరిక అవ్వాలి

ఇష్టముతో చిరునవ్వు పంచాలి



ప్రతి బంధాన్ని అనుసంధానం

చేసుకుంటూ అనుబంధాలను

కొనసాగించాలి అదే అలవాటుగా

భావితరాలకు నేర్పించాలి..


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

16/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

ఒకరికి ఒకరం ఆధారం

 అనంత సాహితీ వేదిక 

తేది : 25/04/25 

అంశం : ఎవరికి ఎవరు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 


శీర్షిక : ఒకరికి ఒకరం ఆధారం


జననముతో మొదలై మరణముతో ముగిసే జీవన పోరాటములో అనుక్షణము ఒకరికి ఒకరం ఆధారమనే పాఠం నేర్చుకుంటూనే బ్రతుకుతున్నప్పుడు... 


కోపాలెందుకు ద్వేషాలెందుకు 

సరిచేసుకొని సహకరించుకుంటే

బంధాలు బలపడవా ? 

అనుబంధాలు కొనసాగవా? 


కులము ఏంటి మతము ఏంటి

మానవత్వముతో మసులుకుంటే

సఖ్యతతో స్నేహాలుండవా? 

ఐక్యతతో మనుష్యులుండరా? 



రూపాలు వేరైనా బంధాలు వేరైనా

ఒకరికి ఒకరమనే తీరే మనదైతే

అవసరాల ఉచ్చులోన 

ఆపదల అంచులోన

సహాయమే అందదా? 

భరోసా నిలపదా? 


చీకటి లేకుండా వెలుగుకి 

విలువ ఉంటుందా? 

ఒకరికి ఒకరం ఆధారం కాకుంటే

సమాజముంటుందా? మనిషికి

మనుగడ ఉంటుందా? 



✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

27/04/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

Tuesday, 22 April 2025

గురువర్యులకు ఇదే నా అక్షరమాల

 అమ్మ నాన్నలకే

గౌరవ రూపం గురువు

పెద్దల ఆశలకు హద్దుల

ఆచూకి గురువు...


పిల్లల ఎదుగుదలకు

ఉతమిచ్చే ఔషధం గురువు

మూర్ఖుపు  మాటలను మాన్పించే

మంత్రము గురువు... 


సత్యాన్వేషణ మార్గంలో

విలువను చెప్పేది  గురువు

అక్షరానికై ఆకలిని 

రేకెత్తించేది  గురువు................



భాధలకు భాద్యతలకు అర్ధం

అందించేది గురువు ...

గమ్మత్తుగా గమ్యాన్ని

చేర్చగలిగేది  గురువు... 


ఓటమిలో ఓర్పును

నేర్పేది గురువు

ప్రయత్నమే గెలుపుగా

అభివర్ణించేది గురువు...


గురువు ఆస్తి అక్షరం

తస్కరించడం ఎవడి తరం

గురువు స్థానం గోపురం

ఎవరికైనా నేర్పును సంస్కారం... 


అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని

ఆశను నర నరాలలో నింపుకొని

ఆజ్ఞానం నిండిన సమాజం పై

అలుపెరగని యోదుడిల గర్జిస్తూ...


నిశిధిలో ప్రయాణించే

ఎందరో సామాన్యులకు

జ్ఞానమన్న బలాన్ని చేకూరుస్తూ

విజ్ఞానంతో ప్రపంచాన్ని నడిపించమని హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ తమ వారసత్వాన్ని అందిస్తూ ఆత్మీయకంగా అందరి గౌరవాన్ని అందుకుంటూన్నా ఎందరో గురువర్యులు........



అందరికి పాదాభివందనాలతో

గౌరవంతో... కృతజ్ఞతలతో

ఇదే నా అక్షరమాల...



✍️ అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి

కథను తిరగ రాయండి

 అనంత సాహితీ వేదిక 

తేది : 21/04/25 (సోమవారం) 

అంశం : కథ వేరేలా ఉండేది


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 


శీర్షిక : "కథను తిరగ రాయండి"


జీవితంలో తొందరగా ఎదగాలన్న 

అత్యాశతో దారితప్పి తిరుగుతున్న

ఓ యువతి యువకులారా

ఆలోచించి చూడండి

మీ కథను మీరే తిరగ రాయండి! 


ఆకాశంలోని చందమామ అందగాడే 

కానీ అందరికి అందేవాడు కాదు 

అందని దాని కోసం పగటి కలలు 

కంటూ కూర్చోక యవ్వనంలోని 

బలహీనతలకు బానిసలుగా మారిపోక

భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసుకోక


ఆశాలకు తగ్గ ఆచరణను

అలవాటుగా అలవరచుకోండి

మీ కథను మీరే తిరగ రాయండి! 


ఇతరులతో పోల్చుకోక 

శక్తి సామర్ధ్యాలను మరిచిపోక 

కుటుంబానికి భారము కాక

కర్తవ్యాలను వదిలేసి పోక


అడుగు ముందుకేసి అవకాశాల్ని

అందుకోండి అనుకున్న స్థాయికి

మిమ్మల్ని మీరు నిలుపుకోండి


అందరూ ప్రశంసించేలా

ఆదర్శంగా అనుసరించేలా

ఓ విజయ గాధను కొత్తగా

మీ కథగా మీరే తిరగ రాయండి! 


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

23/04/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

Wednesday, 12 March 2025

మసకబడిన సంగతులు - రోజులు మారాయి

 అనంత సాహితీ వేదిక 

తేది : 12/03/25

అంశం : మసకబడిన సంగతులు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : రోజులు మారాయి


రోజులు మారాయని తెలుస్తుంది

నన్ను నాకే పరాయి వాడిని చేసేసాయ్ - నన్ను నేనే వెతుక్కునేలా చేసేసాయ్



కల్మషం లేని నవ్వులనే చూచిన కాలమే కనుమరుగైపోయి

మనసు మమతలన్న మాటలే

మసక బారిన పడిపోయాయ్



కలిసుంటే కలదు సుఖమనే 

ఆప్యాయతలు తగ్గేపోయి

ఎవరికి వారేనన్న యుద్ధ

నినాదాన్ని ప్రకటిస్తున్నాయ్



ఆకలిలో అవసరాలలో ఎంతో

బలాన్నిచ్చే చేతులు పోయి

ఆపదే కొంప మీదకొచ్చిన

ధైర్యమిచ్చే స్నేహలే కరువయ్యాయ్



మాటిస్తేనే ప్రాణమిచ్చినంతగా 

నమ్మే పరిస్థితులు పోయి అంతర్జాలం చరవాణిసాయంతో

మోసగించె ఆలోచనలే పెరిగిపోయాయ్



ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన

క్షణాలు మాయమైపోయిఆనందమే లేక మానసిక రుగ్మతలతో ఆరోగ్యాలే పాడైపోతున్నాయ్


బంధాలబలం తెలియని నేటితరం ఎవరికి ఏమవుతామో అర్ధమేకాక

ప్రశ్నలతో సతమతమైపోతున్నాయి


నాడు ఊరంతా తిరిగొచ్చిన అలసిపోని ప్రాణాలు- నేడు నిత్య అవసరాల బ్రతుకు పోరులో మౌనంగా రోధిస్తున్నాయి

గతమెంత వైభవమో అర్ధమవుతున్నా తిరిగి పొందుకోలేని విధంగా రోజులు పరిగెత్తిస్తున్నాయ్




✍️ అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

13/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను...

Sunday, 9 March 2025

నీ " అస్త్రము "నువ్వే

 అనంత సాహితీ వేదిక 

తేది : 09/03/25

అంశం : ఓ పరిమళ వాక్యం


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : నీ "అస్త్రము" నువ్వే


కాలమే కరిగిపోతున్న వేళ

కలలే కనుమరుగవుతున్న వేళ

ఆశలే నిరాశలుగా మారుతున్న వేళ

కన్నీరే హేళన చేస్తున్న వేళ


ఎవరు నీ కోసంగా నిలవని వేళ

ఏ నవ్వు నిన్ను చేరని వేళ 

ఒంటరినన్న భావన బాధిస్తున్న వేళ

బ్రతుకే భారంగా సాగుతున్న వేళ


గడిచినపోయిన క్షణాలు జ్ఞాపకలో

లేక అనుభవాలో తెలియక 

విడిచిపోయిన బంధాలు శపాలో

లేక వరాలో అర్ధంమే కాక


ఆనందం కోసం అన్వేషిస్తున్న

ఆత్మీయత కోసం పరితపిస్తున్న


ఓ మిత్రమా..నాదొక్క మాట వినుకో


నిన్ను నువ్వు మరువకు

నీ నవ్వును అసలే వదలకు

నీకున్న ఏకైక అస్త్రము నువ్వే

నీ బలము బలగము నువ్వే


తిరుగులేని రామ బాణమై

ముందుకి దూసుకుపో

కమ్ముకున్న చీకటిని చీల్చుకుంటూ

స్వయం ప్రకాశముతో సాగిపో



✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

09/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

Saturday, 8 March 2025

"ఆడ" దానిని

 ఆడదానిని నేను "ఆడదానిని"

పుట్టుకతోనే నేను "ఆడ"దానిని


ఇంటి బరువు పరువు మోసే "ఆడదానిని"

వయసొచ్చాక ఏ ఇంటికో "ఆడ"దానిని


వంశాభివృద్ధికి పూనాదినైన "ఆడదానిని"

మగాడి చులకనైన మాటల్లో "ఆడ"దానిని


రూపమొకటిగా బంధాలు అల్లే "ఆడదానిని"

అర్ధరాత్రి కంటబడితే వరసలేని "ఆడ"దానిని


సమస్య ఏదైన మానసికంగా 

బలమిచ్చే "ఆడదానిని"

ఐనా సామాజికంగా నేను చేతగాని "ఆడ"దానిని


మనకంటూ నిర్ణయించిన రోజులలో మహాశక్తినైన "ఆడదానిని"

మిగతా రోజులలో అందరి ద్రుష్టిలో నేను "ఆడ"దానిని



✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

08/03/2025

వెన్నెల రాత్రులు-వెన్నెల హాయిలో

 అనంత సాహితీ వేదిక 

తేది : 07/03/25

అంశం : వెన్నెల రాత్రులు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : వెన్నెల హాయిలో


ఆకాశము విశాలంగా చుక్కలన్నీటిని పరుచుకోగా

వాటి మధ్యన అందమైన చందమామ నిలుచుకోగా


ఆరుబయట అరుగు మీద 

పడుకొని కనులార చూడగా

చల్లని వాతావరణమే

దుప్పటై కౌగిలించుకోగా

తెలియని తన్మయత్వమే 

మనస్సుని కుదిపేయగా


ఆలోచనలే కొత్త రాగాలై

పల్లవలను ఆలపించగా

గడిచిన జ్ఞాపకాలు మదిలో

గమ్మత్తు చేయగా తనివితీరా

నన్ను నేనే చూసుకొని మురిసిపోగా



అమ్మ చేతి గోరుముద్దలు

నాన్న చెప్పిన చందమామ కథలు

ఆడిన దాగుడు మూతల ఆటలు

లెక్కవేసిన చుక్కల ముగ్గులు

వల్లె వేసిన నోటి లెక్కలు 

నోరారా తిన్న ఉప్పుచెక్కలు


చిన్ననాటి చిలిపితనంలో

కల్మషమెరుగని స్నేహలు

గుప్పెదంత గుండెల్లో

అంతులేని కోరికలు 



తిరిగిరాని లోకం చేరేదాక మనల్ని వదలక వెంటాడుతూ మురిపించేది తీయగా మరిపించేది ముచ్చటైనా మన బాల్యమే కదా!!!




✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

08/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

ఆదర్శమైన బంధం

 అనంత సాహితీ వేదిక 

తేది : 02/03/25

అంశం : చిత్ర కవిత


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

శీర్షిక : ఆదర్శమైన బంధం 


మూడు ముడులతో బంధానివై

ఆలోచించలేని నాకు ఆలివై

కష్టాన్నే మరిపించే నవ్వువై

నేను మరవ లేని పేరువై

నా ఎదుగుదలలో వేరువై

వంశాభివృద్ధిలో భాగమై

నన్ను వదలని నీడవై 

నన్నే నడిపి నాతో నడిచిన

నీకు ఏమివ్వగలనే ??? 


కడుపుకి కూడు పెట్టగలిగిన

ఒంటికి చీర చుట్ట గలిగిన 

కంట జారే నీరుని తుడవగలిగిన

బలహీనతలో బలమివ్వగలిగిన 

వయస్సు జోరులో ఎన్ని వేషాలేసిన

ముడతలపాలై శరీరం నీరసించిన

గుడిసెగూటిలో నా చెంతనే నిలచిన

నీకు ఏమివ్వగలనే ??? 


వారసులే మరిచిన ఈ వనవాసంలో - జంటగా నిలచిన ప్రేమ పక్షులమే మనం


చివరి మజిలీ చేరుకుంటున్నా - పొద్దుతిరుగుడు పువ్వులమే మనం


అనువణువు అల్లుకుపోయిన - తణువులమే మనం


మన వెంట ఉన్నదే అందం ఆనందం - అదే మన సొంతం


ఈ ఏకాంతములో ఒకరికి ఒకరం

నేటి తరానికి మనము - మన బంధమే ఆదర్శం


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

03/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

కష్టాలే - కనుమరుగు

 కష్టాల కదలికలో

కనులే మూస్తే కన్నీరూ

దారాలంగా జారుతుంటాయ్


కష్టాలను కసితీరా చూస్తు

ముందుకి అడుగులే వేస్తే

అవే కనుమరుగై పోతుంటాయ్


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

06/03/2025

రాలిన భ్రమలు -భ్రమలోన బ్రతుకులు

 అనంత సాహితీ వేదిక 

తేది : 05/03/25

అంశం : రాలిన భ్రమలు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : భ్రమలోన బ్రతుకులు


ఎగిరెగిరి పడకు 

అసలే తొందరపడకు

ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య

క్షణాల తేడాను మరవకు


నిత్య యవ్యనం నీకు 

ఉండదని తెలుసుకో

సొంతం పంతం అనే

మాటలను మరిచిపో


జ్ఞానానికి విర్రవీగకు

ఐశ్వర్యానికి తలవంచకు

కనురెప్పల మాటున

గుట్టుగా బ్రతకడం నేర్చుకో


బలము నీకున్నా

బలగం ఎంతున్నా

సాటి మనిషిని బానిసగా

చూడడం మానుకో


రంగుకాగితాల తలుకులు

ఈ ప్రపంచానికి అవసరమేమో

ఆకాశము అందదని ఆధారం

భూమేనని నడుచుకో


శ్రమలు లేని భ్రమలు

కడుపుకి కూడు పెట్టవు

భ్రమలోన బ్రతుకులు

ఎప్పటికి బాగుపడవు


సత్యం మరిచిన గురిగింజవి కాకు

జీవితమే గొప్ప బహుమానం నీకు

నిన్ను కమ్మిన భ్రమలే రాలిపోతే

నిన్ను నువ్వే క్షమించుకోలేవు



✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

06/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు*

 ఆడతనములోనే అమ్మతనముని 

గుప్తంగా దాచుకొని

దశలవారిగ, బంధానుసారంగ, 

ప్రేమానురాగాలను, ప్రోత్సాహాలను

అందిస్తున్న... 

నారీమణులారా,

ధీరవనితలారా, 


మీ అందరికీ

 

*మహిళాదినోత్సవ శుభాకాంక్షలు*

💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

ప్రేమతత్వపు జీవితము నీదే "అమ్మ"

 ART- కళింగ ఫౌండేషన్ 

ఆధ్వర్యంలో 

అంశం: “అమ్మ” కవితలకు ఆహ్వానం 



రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

శీర్షిక : ప్రేమతత్వపు జీవితము నీదే "అమ్మ"


నేను ఎవరిని "అమ్మ" నీవే లేకుంటే

నా ఉనికేమిటి "అమ్మ" నీవే కనకుంటే


గర్భగుడిలో రక్తపుముద్దకి

జీవము పోసిన దేవతవు నీవే "అమ్మ"

భాష భావం బంధం పరిచయం

చేసిన ఆదిగురువు నీవే "అమ్మ"


లోకంలోని లౌక్యం ఎరుగని

నిస్వార్ధపు గుణము నీదే "అమ్మ"

బాధ ఏదైన భారం ఎంతైనా

బాధ్యత మరువని మనస్సు నీదే "అమ్మ"


కష్టాల కడలిలో తలవంచక 

ఎదురీదగల ధీరత్వం నీదే "అమ్మ"

భిన్నత్వములో ఏకత్వమునే 

చూపగలిగే సంస్కారం నీదే " అమ్మ"


బిడ్డల క్షేమాన్ని విజయాన్ని కాంక్షించి

బలమైన ఆశీర్వాదం నీదే " అమ్మ"

జన్మలెన్నేత్తిన తీర్చడమే తరముకాని

రుణానుబంధము నీదే "అమ్మ"


దైవత్వమునే తనువుతీరా దాచుకొనిన

ప్రేమతత్వపు జీవితము నీదే "అమ్మ"


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

15/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

అనుబంధాలు - బంధాల అనుసంధానం

 సద్భావన చారిటబుల్ ట్రస్ట్ &

అనంత సాహితీ వేదిక 

సంయుక్త ఆధ్వర్యంలో 


"ఉగాది కవితల పోటీ "


అంశం : అనుబంధాలు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

శీర్షిక : బంధాల అనుసంధానం


అనుకోని అతిధిగా పిండమునై

బొడ్డుతాడు తోడుగా బిడ్డనై 

అమ్మ ఒడిలోనికి చేరాను


నాన్న అనే పిలుపిచ్చే నమ్మకముతో

స్వేచ్ఛగా లోకాన్ని చూసాను


రక్తబంధమేముద్దుగా తోబుట్టువులే 

బలగముగా ధైర్యంగా పెరిగాను


స్నేహాబంధమే హద్దుగా హితులను

సన్నిహితులను పొందాను


అక్షరయజ్ఞంలో  శిష్యుడనై

గురువు నేర్పిన జ్ఞానం నేర్చాను


జంట మంత్రముతో నేను 

సంసారసాగరం ఈదాను


ఏర్పడిన బంధాలను వదలక

మరవక ఆస్వాదిస్తున్నాను


బంధాలకు భాష వేరు

భావాలకు అర్ధాలు వేరు

విధి ఆడే వింత నాటకంలో

ప్రతి పాత్రకు పని తీరే వేరు


మనస్సుకి స్వచ్ఛత కావాలి

మాటలు మర్యాదతో నిండాలి

అవసరాలలో చేయుతనివ్వాలి

కోపాలలో ఓర్పును నేర్పాలి

పాపాలకు హెచ్చరిక అవ్వాలి

ఇష్టముతో చిరునవ్వు పంచాలి



ప్రతి బంధాన్ని అనుసంధానం

చేసుకుంటూ అనుబంధాలను

కొనసాగించాలి అదే అలవాటుగా

భావితరాలకు నేర్పించాలి..


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి

15/03/2025


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

Thursday, 20 February 2025

జ్ఞాపకాల అల్మార - జ్ఞాపకాల చిట్టా

 అనంత సాహితీ వేదిక 

తేది : 20/2/25

అంశం : జ్ఞాపకాల అల్మార


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

శీర్షిక : జ్ఞాపకాల చిట్టా


అల్లరి చిల్లర ఆటలాడిన

ఆ రోజులు ఓ జ్ఞాపకం


అమ్మానాన్నలను మబ్బి పెట్టిన

అబద్దం ఓ జ్ఞాపకం 


గురువు నేర్పిన పాఠాలలో

మొదటి గాయం ఓ జ్ఞాపకం


యవ్వనం చేసిన సందడిలో

కలలు కన్నీళ్లు ఓ జ్ఞాపకం 


స్వార్ధం మరువని స్నేహాలలో

మోసం ఓ జ్ఞాపకం


గెలుపు తాలూకు చాయలలో

ఓటమి ఓ జ్ఞాపకం


బాధ్యత మరిచిన బ్రతుకులలో

సమర్దత ఓ జ్ఞాపకం


అవకాశాల వెతుకులాటలో

ఆకలి ఓ జ్ఞాపకం


అదుపులేని అలవాట్లలో

ఆరోగ్యం ఓ జ్ఞాపకం


పొదుపులేని ఖర్చులలో

మదుపు ఓ జ్ఞాపకం


అహంకార వేడిలో వీడిన

బంధాలు ఓ జ్ఞాపకం


తోడులేని ఏకాంతంలో

ప్రేమ ఓ జ్ఞాపకం


మరణపు కౌగిలిలో చేరిన

రూపం ఓ జ్ఞాపకం


జీవితమిచ్చిన అనుభవాలలో

నాకు నేనే ఓ జ్ఞాపకం



అల్లుకుంటూపోతే అంతులేని పిట్ట 

తలచుకుంటూ పోతే ఆగదు ఈ జ్ఞాపకాల చిట్టా!!! 





✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..

Tuesday, 18 February 2025

ఏకాంతమే ఎదురైతే - ఏకాంతములో వికాసం

 అనంత సాహితీ వేదిక 

తేది : 18/2/25

అంశం : ఏకాంతమే ఎదురైతే 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

శీర్షిక : ఏకాంతములో వికాసం


నిన్న నేడు రేపు 

ఒకటే ఆలోచన

ఒకటే ఆలాపన

ఏకాంతమే ఎదురైతే... 

నిన్నటిని దాటిన నేను

గతంతో నిలిచిపోను

నేడుని చేరుకున్న నేను 

విజయంతో విర్రవీగను

రేపటి కోసం నేను 

ప్రశ్నలతో జీవించను... 


బాధకు భరోసాగా

ఏడ్పుకి ఓదార్పుగా

సహానానికి చిరునవ్వుగా

నిదురలో లాలీపాటగా


ఎవరు లేని ఎవరు చూడని ఏకాంతమే నా తోడు... 


అప్పు అడగనివ్వదు

తప్పు చేయనివ్వదు

గొప్పలకి పోనివ్వదు

సత్యాన్ని మరువనివ్వదు


సమస్యల సహావాసంలో సమాధానమయ్యె

ఏకాంతమే నా తోడు... 


ఏకాంతమిచ్చె వికాసంలో

నన్ను నేను మరువను

నా పై చెడుని గెలవనివ్వను... 



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి


ఇది నా స్వీయ రచన 

    అని హామీ ఇస్తున్నాను..