Sunday, 29 March 2026

మౌన రాజ్యంలో

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...


అంశం: 

మౌనం కాల్చేసిన మాటలు 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : తోచని స్థితిలో



కఠినమైన క్షణాల శబ్దం 

గుండె గోడల్ని బద్దలు 

చేసేలా తాకితే నిశ్శబ్దం 

యుద్ధమే చేస్తుంది


అనుక్షణం..నిరీక్షణ 

ప్రశ్నల సాయంతో 

తరుముతూనే ఉంటుంది 

మూసుకుపోయిన ఆలోచనల 

ద్వారాన్ని తెరవమని


మౌన రాజ్యంలో 

అన్నీ అరాచకాలే 

మాటలను కాల్చేస్తుంది 

భావాలను ఆ బూడిదలో కలిపేస్తుంది

ఒంటరైన మనసుతో 

దాగుడు మూతలు ఆడుతుంది

చలనం లేని స్థితికి చేరుస్తూ 

సమయమే ఆగిపోయినట్టుగా 

కన్నీరులో కరిగిపోతుంది


కల అందామంటే 

గాయం నొప్పి తెలుస్తుంది

లోలోన దిగులు చంపేస్తుంది

చీకటి సాంగత్యాన్ని తరిమేదెవరో 

బ్రతుకు తీపి తెలిసేలా ఓదార్చేదెవరో


దిక్కు తోచని స్థితిలో 

మాటలలోని మాధుర్యాన్ని 

మరుపులోని కమ్మదనాన్ని 

అందించే సొగసైన 

ధైర్యం ఎప్పుడు వస్తుందో

మనసును ఎలా కదిలిస్తుందో

తెలియదు ఎదురే చూడాలి..!



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను

Wednesday, 25 March 2026

మనసు

 

మనసులోని..

భారాన్ని తూకం వేసే

మాటలు లేనప్పుడు

మౌనమే వారధి!


మనసు తోటలో..

బంధమే సమాధిగా

మారుతుందంటే

మనిషిని ముంచే

అహమే సారధి !


మనసున..

పరిస్థితులు సంధించిన

ప్రశ్నలెన్నున్నా ఎలా ఉన్నా

కృంగక నవ్వుతుందంటే

నమ్మకమునిచ్చే ప్రేమే పెన్నిధి !


ఎవరు ఏమై ఉన్నా

నీతో ఉన్నా లేకున్నా

నీ మనస్సే నీకు సన్నిధి

Monday, 23 March 2026

సాకారం కాని

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...

అంశం : చేజారిన స్వప్నం 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు: కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి: 9542000079


శీర్షిక : సాకారం కాని


సాకారం కాని కలలన్నీ 

ఒక్కొక్కటిగా దోసిట్లోకి చేరగా 

కన్నీరే గుండెలోని భారాన్ని కొలిచాయి


అలసిపోయిన ఆలోచనలు 

విస్తృతంగా విశ్రాంతిని కోరగా

నిరాశల ఆకలికి ఆశలన్నీ ఆహుతియైనాయి


కాటు వేసిన కాలం దాటికి 

ఓటముల లెక్క పెరగగా

పగ్గాలు లేని స్వప్నాలు రాత్రికి

జ్ఞాపకాలుగా మిగిలాయి


విజయం దక్కని 

ప్రయత్నాలు శాపంగా మిగలగా 

స్వార్ధపరుల నీడలో

అవకాశాలు జారిపోయాయి


మసి కమ్మిన బ్రతుకులలో

ఆశల వెలుగును వెతికితే దొరకదు 


నేల కొరిగిన కర్ణుడికి 

తెలియని కారణాలెన్నో 

అలాగే నిలబడిన వైనం 

తాలూకు విజయాలెన్నో


ఎదురు చూపుల బరువు ఎంత ఎక్కువైనా? 

ఆ తాకిడిని తట్టుకొని నిలబడితే? 

కాలం కలిసి రాకపోదా!

అనుకూలంగా నిలబడకపోదా!


చేజారిన...

ప్రతి స్వప్నం తోడుగా 

ఒక అనుభవం ఉంటుంది

కదులుతూనే ఉంటే...

కాలమే నిధానంగా 

ఓ సమాధానం రాస్తుంది.


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హమీ ఇస్తున్నాను.

Monday, 16 March 2026

ఓ! కోయిలమ్మా..

 

! కోయిలమ్మా..


పరవశించి పాడుతున్న

! కోయిలమ్మా..

శిశిరం పోయి

వసంతమే వచ్చిందా?

మనసులోని భారమే జారిపోయి

మనశ్శాంతి నిచ్చిందా ?

అంటే...

ఎన్ని హొయలు పోతుందో కోయిలమ్మ?


నేను మనిషిని కాదయ్యా

సమతుల్యతను కోల్పోడానికి

అసమానతలకు లొంగిపోడానికి


ఆశ జీవినే నేను

నిన్నటిలానే నిలిచిపోను

ఎండి రాలిన చోటే మళ్ళీ

పుట్టే ఉపిరినే నేను

అందరి కోసమే నా పాట

అందరి క్షేమమే నా కాంక్ష

న్నంతగా నమ్మే రూపం నేను

యుద్ధ శబ్దంలో నలిగిపోతున్న

గుండె శబ్దంలో ప్రేమను దాచుకున్న


తీపిలోని తృప్తినే మాటలకు అందించి

చేదు చేసిన గాయాన్ని మరిచిపోతున్న

వగరు లాంటి కొత్త సవాళ్ళను స్వాగతించి

ర్పుతో దారుల్ని వెతుకుంటున్న


మన దీపమే అని ముద్దాడితే

మూతి కాల్చకుండా ఉంటుందా?

అర్ధం లేని ఆవేశాలకు ఊగిపోకుండా

నేర్పుగా అదుపు చేసుకుంటున్న

వెటకారం ఎక్కువే కానీ మమకారంతో

జ్ఞాపకాలను దాచుకుంటున్న

సమతుల్యతనే కలిగి అందంగా

బంధాలను అల్లుకుంటున్న


నేనంటూ ఉంటే !

రేపటి ప్రశ్నకు

సమాధానమేని నమ్ముతున్న !

అది నిజమని చెప్పే ఉగాది

వచ్చిందనే పాట పాడుతున్న

అందరికి ఆనందంగా వినిపిస్తున్న

నేను మనిషిని కాదయ్యా

సమతుల్యతను కోల్పోడానికి

అసమానతలకు లొంగిపోడానికి !

Thursday, 12 March 2026

సిసింద్రీలు

1).  ఓ...కథ!

అనగనగంటూ 

పలకరింపుతో ఆలకింపజేస్తుంది

అడుగడుగున 

మలుపులతో ఆలోచింపజేస్తుంది 


 2). ఓ... ప్రకృతి!

ప్రకృతితో మమేకం అత్యద్భుతం 

ప్రకృతితో వియోగం ప్రశ్నార్ధకం


3). ఓ...గురువు!

గురువు ఆస్తి అక్షరం 

గురువు స్థానం గోపురం


4). ఓ... పరీక్ష!

నిశితంగా స్థితిని పరిశీలిస్తుంది

నిశ్చయంగా స్థాయిని పెంచుతుంది


5). ఓ...భార్య

మనసుకు కలల సౌదామిని 

మమతకు కౌగలింతల తరంగిణి


6). ఓ...బంధం!

ప్రేమకు బలమైన సోపానం

ప్రేమానురాగాలకు కొలమానం


7). ఓ...నాన్న!

అలయిక కదిలే శ్రామికుడు

అవగాహనకు రాని సైనికుడు


8). ఓ...ధ్యానం!

నిరంతర అంతరంగ పరిశీలన

నిశ్శబ్దంలోనే మానసిక పరివర్తన


9). ఓ...కష్టం!

సహనానికి సవాలు విసుఓరుతోంది

సమర్ధతకు విధేయతను నేర్పుతోంది


10). ఓ...నమ్మకం!

సందేహాలను తరిమే మంత్రం

సంబంధాలను బలపరిచే యంత్రం


11).ఓ పరుగు!

గెలుపు ముంగిట్లో నిలబెడుతుంది

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది


12)ఓ గుండె!

అలసిపోతే ప్రాణం తీసుకుపోతాది 

ఆరోగ్యంగా ఉంటే ఆయుష్షు నిస్తాది 


13). ఓ శరీరం!

ఆశలతో ఎగిరెగిరి పడుతుంది 

ఆఖరికి మట్టిలో కలిసిపోతుంది


14). ఓ...అలవాటు!

క్రమం తప్పక పని తీరు నేర్పుతుంది

క్రమశిక్షణను బహుమతిగా అందిస్తుంది.


15). ఓ పుస్తకం 

అక్షరాల కూర్పులో లక్షణాలను నేర్పుతుంది 

ఆలోచనల తోడులో కొత్త దారుల్ని చూపుతుంది 


16). ఓ విద్యాలయం!

అక్షరాల జ్ఞానంతో నైపుణ్యాల 

నైవేద్యం కూర్చే ఆలయం

అర్హతనే కానుకగా వ్యక్తిత్వ 

వికాసాన్ని పంచే నిలయం

Wednesday, 11 March 2026

యుగాది

దాగుడు మూతలాడే జీవితంలో

ప్రకృతి పరవశించగా

వసంతం ఆనందాన్నిస్తుంది

ఊహకందని రేపటిని

అలంకరించుకొని తెస్తుంది


రుతువులా రోజులు మారినా

రుజువులేవీ మారిపోవని

కాలం కలగా ఆగిపోదని

పంచ భూతాలు దీవించగా

పంచాంగ శ్రవణం చెబుతుంది


చీకటి దాడులను చీల్చుకొని

పరాభవమునే దాటుకొని

చిరునవ్వులనే స్వాగత తోరణాలుగా

సంబరాల సూర్యోదయాన్ని

ఆహ్లాదకరంగా అందిస్తుంది


అనుబంధాలను ఆప్యాయతలను

సమాజంలోని అసమానతలను

షడ్రుచుల సమ్మేళనంతో

కమనీయ సాంప్రదాయంగా

కమ్మని కలలకు ఆకృతిగా మార్చుతుంది


చేయి చేయి కలపగా

కనుగవలో కాంతి నిండగా

ఉల్లము ఉప్పొంగుతుంది

కొత్త పాట పాడుతుంది


తెలుగు పలుకుల

తీయదనాన్ని జోడించి

ఉత్సవాల ఉషస్సును

ఉత్సాహాల మేధస్సును

వారధిగా సారధిగా పెన్నిధిగా

అందించే తొలి ఆత్మీయ పండుగే! యుగాది!



@ ప్రేమ్ సాగర్ కోటపూరి (అనిర్వ)


Thursday, 5 March 2026

చీకటి పిశాచి - విల్లెక్కు పెట్టి!

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...


అంశం: చీకటి పిశాచి


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : విల్లెక్కు పెట్టి!


కాలం చేసే దాడులలో

బెదిరింపులు తప్పవు

చీకటి కమ్మిన రాత్రులలో 

చిత్రవధలెన్నో గుప్పెడు విప్పవు 


భయం రూపంలో 

అంధకారం అలముకుంటుంది

గుండె లోతుల్లో

వదలమన్న హత్తుకుంటుంది 


మనసొక బానిసైతే...

కన్నీళ్లకు దారిస్తూ మొండికేస్తుంది!


మానసిక భయాన్ని మింగేసే 

నిజమైన చీకటి పిశాచి ఎవరు? 

మనము...మన మనస్తత్వమే!


సందేహాల తరంగాలు సంద్రం 

ఒడ్డున నిలచి స్వాగతిస్తాయా?

సమస్యలు వలయంలో చిక్కిన

సంతోషాలు పిలిచి హారతిస్తాయా?


నెమ్మదిగా ధైర్యాన్ని మర్చిపోతూ 

పోరాడటమే మానేసాం 

బాధలను నిద్రలేని రాత్రులకు 

అంకితం చేసి జాగారం చేస్తున్నాం!


బ్రతుకులో వెలుగు కనపడుతుందా? 

చీకటే వెలుతురిని మింగేస్తుందా?


మసక మబ్బుల చాటున నీడలో దాగిన 

రూపానికి నవ్వుల పూసలను అందివ్వాలి 

ఆత్మవిశ్వామనే కాంతినందించి 

అజ్ఞానంతో నలిగే మనసుకి ఊపిరిపొయ్యాలి


చింతల చట్రం ఎలా ఉన్నా

విల్లెక్కు పెట్టిన అర్జునుడులాంటి ధర్మం 

పాటించి చూపించడమే సాధించి శాసించడమే !


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను

Monday, 2 March 2026

రేపటి కోసం

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...


అంశం: 

"ఎగిరే రెక్కలు చెప్పిన కథలివి" 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరుజిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : రేపటి కోసం 


కొంగు చాటున రెక్కలు ముడుచుకొని 

పిడికెడు మెతుకుల కోసం వీధి వైపు 

చూస్తున్న ఆనాటి చిన్నారికేమీ తెలుసు?


కాలే కడుపుల ఆకలి గుక్కెడు మత్తు 

చుక్కలకు చిల్లరై రేపటిని చిదిమేస్తుందని!


అప్పులే ఆస్తులుగా మారి జీవితాన్ని నిలువ దోపిడి చేసి అక్షరాలపై కక్ష పెంచుతాయని


కక్ష్యలో గ్రహాలుగా గృహిణులు చీకటి 

దుప్పటినే కప్పుకుంటున్నారని


గొప్పలకై తిప్పలు తండ్రుల రాసే వీలునామాలు 

సుతలకు తలరాతలుగా చప్పుడు లేని నొప్పులు


గతాలు గోతులు తీస్తుంటే 

పరిస్థితులు పల్లకీలు మోస్తాయా?

ఆశల రాజకీయంలో అందరం తోలుబొమ్మలమే!

దారి తెలియని తీరులలో నవ్వు 

ఓ నాటకీయ రంగమే!


చరిత్ర చూడని చిత్రాలేమీ లేవు

కాలం కాచుకున్న కథలేవి మాసిపోవు


ఎగిరే రెక్కలు చెప్పిన కథలుగా 

నేటి మగువ మారింది 

హేళనను దాచేస్తూ 

మాటలను సందిస్తూ

యుద్ధభూమిలో నెగ్గిన 

వీర వనితలా రూపుమార్చుకుంది


తీరం దాటి చెప్పుకునేలా 

ప్రతి అవకాశంలో 

ఆకాశాన్ని అందుకుంటుంది 

తనకంటూ ఓ కథనే రేపటి 

కోసం రాసుకుంటుంది


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను



శీర్షిక : రేపటి కోసం 


కొంగు చాటున రెక్కలు ముడుచుకొని 

పిడికెడు మెతుకుల కోసం వీధి వైపు 

చూస్తున్న ఆనాటి చిన్నారికేమీ తెలుసు?


కాలే కడుపుల ఆకలి 

గుక్కెడు మత్తు చుక్కలకు 

చిల్లరై రేపటిని చిదిమేస్తుందని!


అప్పులే ఆస్తులుగా మారి 

జీవితాన్ని నిలువ దోపిడి చేసి 

అక్షరాలపై కక్ష పెంచుతాయని


కక్ష్యలో గ్రహాలుగా 

గృహిణులు చీకటి 

దుప్పటినే కప్పుకుంటున్నారని


గొప్పలకై పడే తిప్పలు 

తండ్రుల రాసే వీలునామాలై 

సుతలకు తలరాతలుగా 

చప్పుడు లేని నొప్పులనిస్తాయని...!


అయితే...


గతాలు గోతులు తీస్తుంటే 

పరిస్థితులు పల్లకీలు మోస్తాయా?

ఆశల రాజకీయంలో అందరం తోలుబొమ్మలమే!

దారి తెలియని తీరులలో నవ్వు 

ఓ నాటకీయ రంగమే!


చరిత్ర చూడని 

చిత్రాలేమీ లేవు

కాలం కాచుకున్నా 

కథలేవి మాసిపోవు


ఎక్కడుంది నాటి మహిళ 

మూగబోయిందా? 

మాయమైపోయిందా?


ఇలా ప్రశ్నిస్తే నేనేమని చెప్పగలను! 


గతానికి కూడా ఒక హద్దుంటుందని 

ఏనాడో చట్రం దాటింది



ఎగిరే రెక్కలు చెప్పిన కథలుగా 

నేటి మహిళ మారింది 

హేళనను దాచేస్తూ 

హుందాగా వ్యవహరిస్తూ

మాటలను సందిస్తూ 

యుద్ధభూమిలో నెగ్గిన 

వీర వనితలా రూపుమార్చుకుంది


సంద్రంలోని నావలా 

ఎదురొచ్చే అలలను 

దాటేస్తూ కలలను చూస్తుంది.


అర్హతెక్కడిదని మొరిగే నోర్లకి

అడగాలంటేనే ఒక అర్హతుండాలనే 

స్థాయికి ఎదుగుతుంది 


తీరం దాటి చెప్పుకునేలా 

ప్రతి అవకాశంలో 

ఆకాశాన్ని అందుకుంటుంది 

తనని తానే గెలుచుకుంటూ 

విలువను పెంచుకుంటుంది

తనకంటూ ఓ కథనే 

రేపటి కోసం రాసుకుంటుంది...!


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను

Sunday, 1 March 2026

గాలిలా వీచింది

అలసిన  ఆ ముఖము 

చూస్తేనే తెలుస్తుంది 

పని ధ్యాసలో పడి ఎప్పుడు తిన్నాడో 

ఎంత మాత్రం నిద్రపోయాడో 

ఆకలికి పస్తులకి మధ్య ఎంతగా 

నలిగిపోతున్నాడో ? ఏమో?


ఊరు గాని ఊరు వచ్చి 

కూలి డబ్బుల కోసం

అమ్మే వస్తువు(కోవాబన్) ధరకన్నా 

పడే కష్టం విలువే ఎక్కువైనా

కుటుంబాన్ని పోషించాలని 

పోరాటమే చేస్తున్నాడు


బెల్లం చుట్టూ ఈగలన్నట్టు 

ఆ మనిషిని చుట్టేసేసి 

ప్రశ్నల మీద ప్రశ్నలతో 

దాడి చేసి దడ పుట్టించేశారు 

నిందల్లాంటి మాటలతో భయపెట్టేసి 

అందరిలో ఉన్నా ఒంటరిని చేసేసారు 


ఉద్దేశం గాలికొదిలేసి బాధ్యత మరిచిన 

కొందరు జర్నలిస్టులనే ముసుగులో 

రెక్కాడితే గాని డొక్కాడని 

అతని మీద వీర ప్రతాపం చూపించేసారు..


అందరి ముందు అసహనం నిస్సహాయంలో 

ఆ పేదవాడి గుండె ఎంతటి వేగాన్ని చూసిందో 


కనుల గూడులో నుండి 

కన్నీరూ రానివ్వకుండా బన్ ముక్కలను 

మింగిన వైనమే చాటుతుంది

ఒక చిన్న నమ్మకం కోసం 

ఎంతగా తహతహ లాడిందో 

ఆ మనసు! దేవునికే తెలియాలి!



మతమేదైనా కులమేదైనా 

ఉన్నోడికైనా లేనోడికైనా 

బాధొకటే ఆకలి తీరొకటే  


వ్యవస్థకు మీడియాకు మధ్య సామాన్యులే  

ఒక ఎరగా నలిగిపోతున్నారు మిగిలిపోతున్నారని 

చెప్పడానికి ఇదొక సూచన


బలంలేని వాడిపై నేడు లేచిన నోర్లు! 

బలగం ఉన్నోడిపై ఆ తెగువ చూపగలరా?

మనిషిగా బ్రతకడమే మరిచిపోయి 

ఏమి సాధించాలనుకుంటున్నారో ?


ఆ పేదవాడి గుండె చప్పుడు 

ఎన్ని హృదయాలను తాకిందో 

మద్దతు పెరిగింది

పడ్డవాడు చెడ్డవాడు కాదన్నట్టు

అవమానం జీవితకాల శిక్షలా కమ్మేసిన 

అతని వైపుకి గాలిలా వీచింది అభిమానం 

చాటింది మానవత్వపు పరిమళం.

Thursday, 26 February 2026

నమ్మకమైన కల - లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...


అంశం: నమ్మకమైన కల


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది 


నిజంకాని దాని కోసం ఊహలతో ఉసులాడడం 

ప్రయాసలతో ప్రాకులాడడం మానవ నైజం


పట్టుకున్న కుందేలికి 

మూడే కాళ్ళు అనే గొప్ప 

మూర్ఖత్వపు సూత్రాన్ని దాటి 

పరిశీలించో పరీక్షించో 

తెలియని విషయం గురించి 

అధ్యయనం చేయడమో!

అర్ధం చేసుకోవడమో! చాలా 

అరుదుగా అలవరచుకున్నాం


గర్భగుడిలోని దేవుడే మన గమ్యమైతే 

ప్రతి అడుగులో శ్రద్ధ భక్తి కలబోసుకొని 

ముందుకి నడిపిస్తాయి... కాదంటారా?


కన్నీళ్ళు కొత్త కాదు

కలలు పాత కాదు 


కలలు సాకారం కావాలంటే

పరివర్తన కలిగి ప్రవర్తించడం 

మొదటి లక్షణం కావాలి

మార్పుకోసం ముందు మనమే 

మారాలి మార్చుకోవాలి


నమ్మకమైన కల ఒక్కరికే పరిమితం కాదు 

బానిసకు విముక్తినిస్తుంది 

రేపటికి భరోసానిస్తుంది 

భయానికే సవాలవుతుంది 

అమ్మకానికి వీలుకానీ 

వీలులేని నమ్మకాన్ని నరనరాల్లో 

నింపేసి ముందుకు నడిపిస్తుంది


జాతిలోని అందరిని మేలుకొల్పుతుంది

అందరికి ఓ లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను

Wednesday, 25 February 2026

చివరిదైన ఏ క్షణమైనా

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...


అంశం: "ఈ క్షణమే చివరిదైతే" 

తేది: 25/02/2026


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : చివరిదైన ఏ క్షణమైనా 



చివరిదైన ఏ క్షణమైనా 

ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందిస్తుందా?

మోయలేని భారాన్ని ఆ మదికి 

పరిచయమే చేస్తుందా?


క్షణం ఆలస్యం లేకుండా 

ఆలోచనలు నిద్రపోతాయా?

ఎవరిని ఆశ్రయించాలనే 

అర్థంకాని స్థితిలో పరిగెత్తిస్తాయి


కన్నుల బాసలు నిశ్శబ్ద భాషలో 

హృదయ రోదననే స్పష్టంగా చూపిస్తూ 

కన్నీటి సంగమాన్ని సృష్టిస్తాయి


పురిటి నొప్పులు 

ఒక ఊహకి ఆశకి ఆధారమైతే 

చితి మంటలు ఒక రూపానికి 

జ్ఞాపకానికి సవాలు కాకుండాపోతుందా?


ఆకాశమే మీద పడ్డట్లు 

తీరిపోని నరకయాతన 

చెప్పుకోలేని మరణ వేదన మధ్య 

ఊగిసలాడుతుంది ఆ ప్రాణం


ఋణాను బంధాలకై చేస్తున్న 

స్వారీ ఆగిపోతుంది 

ధైర్యం మెల్లగా విడిచిపోతుంది

జీవించిన ఓ కథకు మంచి 

ముగింపు ఉండాలని ఆశిస్తుంది


ఈ క్షణమే చివరిదైతే!


కృతజ్ఞత తెలపని 

ప్రేమ చూపని 

క్షమాపణ అడగని 

గుణాన్ని మననం చేసుకుని 

జీవితపు అంచున గుండె కుమిలిపోతుంది 


చివరి సారిగా ఓ అవకాశం 

మార్పు కోసం కావాలని ప్రాధేయపడుతుంది



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను

Saturday, 21 February 2026

అనుకోని అతిథిలా

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...


అంశం: అనుకోని అతిథి

తేది: 22/02/2026


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : అనుకోని అతిథిలా 



ఊహతెలిసాక అందరూ స్వప్న వేదికలో సభ్యత్వం లేకుండానే ఉంటారా? 

ఊహలు గిల్లకుండానే ఉంటాయా?


నిరంతరం తలపుల మలుపులతో 

జీవిత ప్రయాణమెక్కడ ఆగుతుందో 

తెలిసే అవకాశం లేదు!

చివరి మజిలీ ఇదేనని చెప్పే 

పరిస్థితిలో ఎవ్వరుండరు !


వేదననే దత్తత తీసుకున్నట్టు వ్యవహరిచేస్తాం 

మనసు లోతులలో దాగిన 

తీరాలన్నింటిని దాచేస్తాం 


ఏదో అయిపోవాలని! ఎక్కడికో వెళ్లిపోవాలని! ప్రపంచమే గులాం అనాలని! 

తెగ ఆరాటపడిపోతుంటాం


ఆశలకు తగ్గ ఆలోచనలతో 

ముందుకు సాగిపోతాం 

అనుకున్నదే అవ్వకపోతే మారం చేసేస్తాం 


పట్టిందల్లా బంగారం కావాలనే ధోరణి చూపిస్తాం 

దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందేనని నిర్ణయాలు చేసేస్తాం 

 

అనుకోని అతిధిలా వచ్చే...


ఓటమిని తట్టుకోలేము 

అవమానాన్ని భరించలేము 

ఒంటరితనాన్ని ఓడించలేము 

మరణాన్ని స్వాగతించలేము 


కానీ! తనువులు శాశ్వతమని

పరువులే గెలుపులని 

సంపదే గుర్తింపని 

అధికారమే గౌరవమని మురిసిపోతుంటాం 

మనిషిగా బ్రతకడమే మరిచిపోతుంటాం...!


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను

Wednesday, 18 February 2026

చిన్న బాధ దూకేస్తుంది

 అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి 


అంశం:అలాగే మిగిలిన భావం

తేది : 19/02/2026


రచన: ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు: కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079 


శీర్షిక: చిన్న బాధ దూకేస్తుంది 



పగలంతా పని ఒత్తిడులు 

పరిచయాల పలకరింపులు 

ఆశల రెక్కలు సంపాదన లెక్కలు చుట్టేసినట్టుంటాయి అందుకేనేమో  

ఏ యోచన చేయాలనే ధ్యాసే ఉండదు 

ఒకవేళ ఉన్నా వీలుపడదు! 


సంధ్యా వేళకు వచ్చే బడలిక  వద్దంటే ఏ కదలిక ఇంటికి చేరి ఉత్తేజితం పొంది నిశ్చింతగా 

కుక్షి నింపుకుని విశ్రాంతి కోసం మంచమెక్కాకా మనసు గుమ్మానా గుసగుసలు మొదలు...


నగరమంతా నిద్రోతున్నా 

హృదయమే శ్మశానమై 

నిశీధిలో ఒంటరి ప్రయాణం చేస్తుంది

నలుగురు మోసే ఎముకల 

గూడుకి ఏదో తెలియని తీరని 

లోటు మాత్రం వెంటాడుతుంటది 


ఏమిటని ప్రశ్నించుకుంటే..

స్పష్టత రాదు సంతృప్తినివ్వదు

ఎక్కడో ఎప్పుడో మిగిలిపోయిన 

చిన్న బాధ దూకేస్తుంది


అన్నీ ఉన్నట్టే ఏవీ అందనట్టే 

మధ్యతరగతి జీవులకి 

దుప్పటి కప్పుకున్నట్టే

మోసే కలల కుంపటికి


అలాగే మిగిలిన భావాలు

భావోద్వేగాలుగా మారి 

కృశించిపోతుంటాయి..

నడి రాత్రిలో కన్నీటి పర్యాంతమై 

నాలుగు గోడల మధ్య 

నలిగిపోతుంటాయి..


✍️అనిర్వ✍️ 

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...!

Tuesday, 17 February 2026

మన ఉగాది

 ఉగాది పండుగ సందర్భంగా తపస్వి మనోహరం అంతర్జాల ebook/ వార, మాస పత్రికల కొరకు కవిత...


అంశం: ఉగాది


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079 


శీర్షిక: మన ఉగాది


నక్షత్రాల గమనాన్ని లెక్కించే రోజది

తలరాతల్నే మార్చేదిగా నమ్మకమే ఇస్తుంది


మోడైపోయినా... 

పచ్చని కళను అద్ది 

కొత్త చిగురులనే 

ఆశగా చూపిస్తుంది


రుచులు రూపాలు వేరైనా 

ఎవరికి ఎవరనే తీరైనా 

షడ్రుచుల కలయికతో 

మనిషి జీవన సరళిలోని 

సత్యాన్ని బోధిస్తుంది


జీవిత కథలో అందమైన భాగమై

ఆది నుండే నూతన ఉత్తేజాన్ని 

అందిస్తూ అదే ప్రేరణతో 

ముందుకు నడిపించేది


తెలుగు సంవత్సరాది మన ఉగాది...!



@ ప్రేమ్ సాగర్ కోటపూరి(అనిర్వ)


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను!

Sunday, 15 February 2026

ప్రకృతిని ప్రేమిద్దాం స్పృహా కలిగి జీవిద్దాం

 ప్రకృతినిప్రేమిద్దాం - స్పృహాకలిగిజీవిద్దాం


ప్రకృతి ఒడిలో ఆడిన ఆటలు

ప్రకృతి బడిలో పాడిన పాటలు

ప్రకృతి సాక్షిగా నేర్చిన కథలు

ప్రకృతి సూటిగా నేర్పిన పాఠాలు

మరువ తగునా? మరచి బ్రతకతగునా?


ప్రకృతి అంటే అందం ఆనందం

ప్రకృతి వెంటే ఆత్మీయం

ప్రకృతితో మమేకం అత్యద్భుతం

ప్రకృతి వియోగం ప్రశ్నార్ధకం


అందరూ విస్మరిస్తూ మౌనమై నిలుస్తున్న వేళ

ఏమని చెప్పను ఎంతని చెప్పను నాలోని బాధను

ఎవరికి చెప్పను ఎలా చెప్పను నాలోని ఆవేదనను

అడవి తల్లి ఉలిక్కిపడేలా అరచి అరచి చెప్పనా

నేల తల్లి తల్లడిల్లేలా ఏడ్చి ఏడ్చి చెప్పనా


భూమి తోడున వృక్షముల నీడన

పంచుకున్న ఆహ్లాదం పెంచుకున్న ఆరోగ్యం

అభివృద్ధి శిఖరాల్ని చూస్తున్న తరుణంలో

వాటి నిర్ములనలో అంతా అంతమైపోతుంటే


దినదినాభి వృద్ధి కోసం ఫలింపుకై ప్రాకులాడుతూ

మందు మీద మందు చల్లి భూసారాన్ని చంపుకుంటూ

ఆహారంలోని నాణ్యతకై వెతుకులాట సాగిస్తుంటే


భూమిలోనే నీరు ఇంకిపోతుంటే

అవసరాల దప్పిక చుక్కలు చూపెడుతుంటే

గుక్కెడు నీరు కోసం అడుగులు లెక్కెడుతూ

భగీరథుడై ఎవరొస్తారా అని ఎదురుచూస్తుంటే


వాహనాల గణాంకాలను

ఫ్యాక్టరీలను పెంచుకుంటూ

స్వచ్ఛతకు కలుషితమద్ది

అర్ధము లేని జీవనాన్ని సాగిస్తుంటే


వివరములేని వాతావరణమే

దాగుడు మూత లాడుతుంటే

విపత్తుల విళయతాండవమే

భవిష్యత్తుని ప్రశ్నిస్తూంటే

అనారోగ్యాల సమ్మేళనమే

అలంకారహారమై భక్షిస్తుంటే


బాధ్యత మాటున జీవిస్తూ

వనరులను మరిచిపోతే ఎలా

మనిషి మనుగడకే సవాలవుతుంటే

సరైన మార్గాలను ఆలోచించకపోతే ఎలా


విజ్ఞానంతో సృష్టికి ప్రతిసృష్టి చేయగలమేమో?

అధికారులై సాగిపోగలమేమో? అందలమెక్కి ఏలగలమేమో?

పోటీయే లేరని విర్రవీగగలమేమో?


ప్రకృతే కన్నెర్ర చేస్తే ... 

నువ్వెంతా? నేనెంతా?

జారిపోయే ఇసుక రేణువంత

గాలికి కొట్టుకుపోయే చిత్తుకాగితమంత

నేలలో ఇంకిపోయే నీటి బిందువంత

క్షణకాలములోనే వదిలిపోయే ప్రాణమంతా


ప్రకృతిని ప్రేమిద్దాం స్పృహా కలిగి జీవిద్దాం

పర్యవరణాన్నికాపాడుకుందాం భావితరాలకు అందిద్దాం

Thursday, 12 February 2026

మరణ శాసనమే!

 అనంత సాహితీ వేదిక 

పద/వాక్య కవిత్వ పోటీకి

తేది : 12/2/26

అంశం: నిశ్శబ్దం రాసిన కవిత


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక :  మరణ శాసనమే!


ఏమైందో ఆ తల్లికి 

ఎంత గాయమైందో ఆ గుండెకి 

ఎన్ని ప్రశ్నలు అలుపులేకుండా దాడి చేసాయో?

హృదయపు ఘోష ఒంటరితనంలో 

అలసిపోయిందా? ఆగిపోయిందా?


ప్రసవ వేదనలో యుద్ధమే చేసి ప్రాణమే నిలుపుకున్నదే! 

ప్రాణం విలువ తెలియదనుకుందామా?


బిడ్డగా ఇల్లాలిగా తల్లిగా ఉద్యోగిగా చూసిన ఏ జీవితం కూడా ఆపలేక తలవంచి దారిచ్చిందా ?


పని భారమా? భవిష్యత్తుకై భయమా ?

బ్రతుకులో ఆనందమే లోపమా?

ఏ విషపు కాటు మనసును మలినం చేసిందో!

ఏ నిస్సహాయపు వేషము అస్తమయం వైపు నడిపించిందో! 

అంతు చిక్కని అయోమయమే అంతా!


ఏ సమాధానము సంతృప్తినివ్వలేదా?

ఏ బంధము చొరవ చూపి భరోసానివ్వలేదా?


ధైర్యము ఎలా కూడబెట్టుకుందో 

బిడ్డలకు ఏమి చెప్పి ఒప్పించుకుందో 

తనువూ చాలించాలనే నిర్ణయించుకుంది.


క్షణకాలంలో ఇనుప చక్రాల రైలు బండి 

కూతలేసుకుంటూ యమపాశమై 

ఎంత దూరం ఈడ్చిందో ఆ ప్రాణాలకై 


రక్తపు మడుగులలో శబ్దాల మాటున 

ఓ నిజం స్తబ్ధుగా గాలిలో నిలిచిపోయింది 

ఎవరు ఎక్కడ విననంతగా 

దిగ్బ్రాంతికి లోనూ చేసింది 



సమాజమే ఓడించిన మహిళగా

నిశ్శబ్దంలో ఓ మరణ శాసనమే రాసింది...!



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

Tuesday, 10 February 2026

నిశ్శబ్ద రోదన

 అనంత సాహితీ వేదిక 

పద/వాక్య కవిత్వ పోటీకి

తేది : 10/2/26

అంశం: మనసు కాలిన వాసన


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక :  నిశ్శబ్ద రోదన


నిద్రిస్తున్న సంగతి మరిచిందేమో!

అనుకోని అతిథిలా మది తలుపులను తడుతూనే ఉంది పంతం వదలక - ఓ ప్రశ్న!


నీకున్న విలువెంతా? 

అంటూ ముందు నిలిచింది


ప్రతి ఉదయం భానుడిచ్చే ఉత్సాహాం 

ఊరేగింపుగానే మిగిలింది

చీమల దండు నేర్పే పాఠం 

గొప్పదైనా నాలో నిలవలేకపోయింది


సమయమెంత వృదాయైనదో 

పరిస్థితులు బిగబడితే తెలిసింది


ఆహ్లాదాన్నిచ్చే ప్రతి అంశంలో

శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా 

మలచి వయస్సు ముచ్చట్లలో

అవసరాలను మరిచి

అవకాశాలను వదిలి 


ఆశల వెంట పరిగెడుతూ 

ఆశయాన్నే గుర్తించడం మానేసి 

గమ్యంలేని అర్థంలేని జీవితం చూసాకా!


అలసి నలిగిన మనస్సు చేసే 

నిశ్శబ్ద రోదనలో మనిషిగా ఓడిపోయి మరమనిషిగా నిలబడిపోయానని 

నేడు వాస్తవం నాకు అర్థమైంది!


ఎదురుదాడి చేయలేని నిస్సహాయంలో సమాధానం చెప్పలేక మౌనమే నాకు తోడైంది! 


పరివర్తన కోసమే ఈ మేలుకొలుపని 

ఆ రాత్రికాల సమయం చెప్పకనే చెప్పింది!


✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

Saturday, 7 February 2026

అందంగా తీర్చిదిద్దుతా

 అనంత సాహితీ వేదిక 

పద/వాక్య కవిత్వ పోటీకి

తేది : 8/2/26

అంశం:

"జీవితం ఒక స్వప్నమైతే"


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక :  అందంగా తీర్చిదిద్దుతా


తెల్లటి కాగితంపై సిరా చుక్కనై నల్లటి అక్షరాలుగా మారి రాజునై మంత్రినై ఎవరు రాయని సుందరకావ్య రూపానికి గ్రంథకర్తగా అందులో ప్రతి పాత్రను అందంగా తీర్చిదిద్దుతా!


నీతి నిజాయితీ లేని ద్రోహులను పూర్తిగా వెలివేస్తూ మంచి చెడుల విచక్షణ మరిచే మూర్ఖులకు సూటిగా గుణపాఠం చెబుతా! 


డబ్బుకు దాసోహమనే జబ్బును 

తొందరగా నిర్మూలించి మనసు 

మమతలకు అగ్రతాంబూలమిచ్చి

పాడి పంటలకు ఉపిరిపోసి ఉమ్మడి 

కుటుంబాల ఉనికిని చాటింపు వేస్తా! 


కుల మతాలను సాధనాలుగా మలిచే రాజకీయాన్ని మాయం చేసేసి నాయకుడే అవసరం లేని సమాజాన్ని నిర్మిస్తా!


అభివృద్ధి పేరున పట్నం చేరి అర్ధంలేని అవసరంలేని అనర్ధాలుకు బానిసలుగా తాకట్టు పెట్టుకుంటున్న అందరిని పల్లెకి పిలిపించి వృక్షజాతికి జీవమిచ్చే యజ్ఞం మొదులుపెట్టిస్తా!


ఆశయం ఉన్నోడికి గెలుపోటములతో సంబంధమే లేని ప్రయాణమే ఉంటుందని గుర్తుచేస్తూ శ్రమకు తగ్గ ఫలాన్ని వరంగా మార్చేసి కనులకు కన్నీరుని తొలిగించి 

కలలనే కానుకగా రాసిస్తా! 


ప్రతి చిన్న విషయంలో అందాన్ని 

వెతుకుతూ ఆస్వాదించేలా సంతృప్తిని అణువణువూ నింపేసి

నిరాశ చెందకుండా ఆనందంగా 

జీవించడమే జీవితమని నేర్పిస్తా!



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

నాకు...మాతృభాషంటే!

 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తపస్వి మనోహరం e-book/ మాస పత్రిక/ వార పత్రిక కొరకు రాసిన కవిత...


అంశం : అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరుజిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక : నాకు...మాతృభాషంటే!


మాతృభావ ఆప్యాయతను

ప్రతి పదములో నింపుకున్న

ఆత్మీయ ఉత్తేజ అనుబంధం 


సరళమైన స్పష్టతను 

వన్నెగా మలుచుకున్న

సాహిత్య సౌరభం 


ఖచ్చితమైన ఆకృతితో

సంస్కృతి వారసత్వమున్న

తాత్విక భావోద్వేగం


మాటల్లో ప్రియత్వం

చేతల్లో సజ్జనత్వమున్న 

మృదువైన వ్యక్తిత్వం


మనస్సుతో మమేకమై

అంతర్గత చైతన్యమున్న

నిర్గుణత్వమైన ఆత్మాభిమానం


✍️అనిర్వ✍️  

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

Sunday, 1 February 2026

ఆశల హారము

 అనంత సాహితీ వేదిక వారి ప్రతిదినం

పద/వాక్య కవిత్వ పోటీకి రాసిన కవిత



అంశం: 

" ఆశల దాహం"


రచన: ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు: కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి: 9542000079


శీర్షిక: ఆశల హారము


ఓ మనిషి!


నీ పయనమెటుపోతుందో 

ప్రశ్నలతో దారి చెప్పగలవా?


చూడని రేపటికి , సమాధానమే తెలియని 

చోటుకి ఓపికతో ఎదురుచూసేలా ఆలోచింపచేసేది మన లోని ఆశే!


హద్దు దాటని అనుకూలతలో

ఉన్నన్నాళ్ళు - ఆశ చెడ్డది కాదు!


అత్యాశగానో దురాశగానో రూపాంతరమే చెందేలా మనమే తయారైతే!

ఆశ కూడా హత్య చేస్తుంది!


తల్లిదండ్రుల ఆశల భేరం బిడ్డల మానసిక

స్థితి గతులను మరచిపోతుంది.!


కంచెకు చేరే ప్రేమకథలు విఫలమంటే ఆశ లేని మరణాలే గమ్యాలుగా మారుతున్నాయి.!


ముసుగు దొంగలు ఆర్థిక వేటలో ఆశల వలలే వేస్తూ నమ్మకాన్ని వేలం వేస్తుంటే మానవత్వానికి సమాధి చేస్తూన్నట్టే ఉంది.!


జీవితపు విలువ తెలియని బలహీనులుగా మారుతున్నంత కాలం నిరాశ నిస్పృహలు దాడులు చేస్తూనే ఉంటాయి.!


ఆశల హారము హద్దుగా

కంఠానికుంటే ముప్పేమిలేదు!


అంతులేని అర్థంలేని తీరని దాహములా మారితే! మౌనంగా హింసిస్తుంది!మానాన్ని హరిస్తుంది!దేహాన్నే దహిస్తుంది! 



✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

Thursday, 29 January 2026

కొత్తగా చూడగలవు

 అనంత సాహితీ వేదిక వారి ప్రతిదినం

పద/వాక్య కవిత్వ పోటీకి

బుధవారం 28/01/26 నాడు ఇచ్చిన అంశముకై రాసిన కవిత.



అంశం: 

" ఆలస్యమైన వీడ్కోలు..."

తేది: 29/01/2026


రచన: ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు: కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి: 9542000079


శీర్షిక: కొత్తగా చూడగలవు!



నిన్ను నువ్వే క్రొత్తగా చూడాలనే ఆశ కలిగుంటే! అన్వేషణ మొదలెట్టు!


నిరీక్షణతో క్రమశిక్షణతో నిన్ను  మలుచుకోవాలని అర్థమవుతుంది!


జ్ఞానము లేదా? సమయము లేదా? గెలవాలని ఆలోచన లేదా? పని చేయడం చేత కాదా?అంటే?వున్నా! పూర్తిగా వాడే విధానమే తెలియదని తెలుస్తుంది.


చదువులున్నా సంస్కారమున్నా సంపాదించగలనే నమ్మకమున్నా

నిన్ను నువ్వే తెలుసుకోలేని స్థితిలో ఉంటే ఏమిటి లాభమనే! గొప్ప ప్రశ్న ఎదురవుతుంది?


దాహమంటేనే బావి త్రవ్వుకునే గుణమే నీ సొంతమైతే నిలకడలేమి నిన్ను వెంబడించదా? అవసరమైతేనే ఆలోచిద్దామనే వైనమే నీదైతే నాణ్యత నీ నైజాములో ఉంటుందా?


వంద అబద్దాలకు అలవాటు పడి నిన్ను నువ్వే కోల్పోయేకన్నా నిజం కోసం నీ ఉనికి కోసం నీ కోసం ధైర్యం చేయడమే ఎంతో మేలు!


ఆలోచించు ఎక్కడ దొరికిపోయావో? ఎక్కడ ఆగిపోయావో?నీకే స్పష్టతగా తెలుస్తుంది! 


ఆలస్యంగానైనా పర్వాలేదు అనవసరపు అలవాట్లకు వీడ్కోలు పలికేసి కొత్త అధ్యాయం లిఖించగలిగితే! వెనకబడిపోతున్న నీవు కొత్తగా చూడగలవు! ఈ ప్రపంచానికి నిన్నే గొప్పగా పరిచయం చేయగలవు!


✍️అనిర్వ✍️

@ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

Wednesday, 28 January 2026

ప్రేమకు నిదర్శనం

వాలంటైన్స్ డే సందర్భంగా తపస్వి మనోహరం అంతర్జాల ebook/ వార, మాస పత్రికల కొరకు రాసిన కవిత...


తేది : గురువారం 29/01/2026


అంశం: వాలంటైన్స్ డే 


రచన: ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు: కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి: 9542000079 


శీర్షిక: ప్రేమకు నిదర్శనం 


ప్రేమించటమంటే? ప్రేమించాలని ఆశించటమా? ప్రేమిస్తున్నానని చెప్పటమా?


మనస్సు పొరల్లో బాధ్యతాయుతమైన 

భావమును,ప్రేరేపించే మనస్సును కలిగి జీవించడమే ప్రేమించటం!


వయస్సు హంగులలో వరస పొంగులలో దోబూచులా మారి దోచుకోవడమా? 


దూరము ఎంతైనా దారులు వేరైనా అడుగడుగునా గమనించుకుంటూ బాటలు వేసుకుంటూ కొనసాగడమే ప్రేమించటం!


అబద్ధాలకు అపోహలకు లొంగిపోయి ఊహలకే పారిపోయే  నిస్సహాయమా?


హద్దులు దాటి యుద్ధమే చేయగల నిర్భయమైన నిర్ణయంలా నిత్యము నిజమై బ్రతకటమే ప్రేమించటం!


ప్రేమ ప్రేమ అని ప్రకటిస్తూ ఉసరవిల్లిలాగా వ్యక్తుల్ని వ్యక్తిత్వాలను మార్చుకోవడమా?


అర్థం పరమార్థం ఎరిగి ప్రతిచోటా సన్నద్ధం కలిగి ప్రేమనివ్వడానికి కట్టుబడి ప్రయత్నించడమే ప్రేమించటం!


ప్రేమించటమే ప్రేమకు నిదర్శనం

అదే! ప్రేమకు గొప్ప నిర్వచనం...!



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఈ కవిత నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...


ప్రేమించటమంటే? ప్రేమించాలని ఆశించటమా? ప్రేమిస్తున్నానని చెప్పటమా?


మనస్సు పొరల్లో బాధ్యతాయుతమైన 

భావమును, ప్రేరేపించే మనస్సును కలిగి జీవించడమే ప్రేమించటం!


దూరము ఎంతైనా దారులు వేరైనా బాటలు వేసుకుంటూ అడుగడుగునా గమనించుకుంటూ కొనసాగడమే ప్రేమించటం!


హద్దులు దాటి యుద్ధమే చేయగల నిర్భయమైన నిర్ణయంలా నిత్యము నిజమై బ్రతకటమే ప్రేమించటం!


అర్థం పరమార్థం ఎరిగి ప్రతిచోటా సన్నద్ధం కలిగి ప్రేమనివ్వడానికి కట్టుబడి ప్రయత్నించడమే ప్రేమించటం!


ప్రేమించటమే ప్రేమకు నిదర్శనం 

అదే! ప్రేమకు గొప్ప నిర్వచనం...!