యుద్ధం - అనర్థం
వద్దు వద్దు రద్దు రద్దు అనే అరుపులతో
తూట్లు పడ్డ హృదయపు శ్వాస
ఓ వైపు వినిపిస్తుంటే...
గాయం చేయడమే ధ్యేయమన్నట్లు
మాన్పే దారి లేనట్లు దూసుకొస్తున్న
ఆ ఫిరంగులతో
ఓ మాట
చెప్పాలని ఉంది...
అడవిలో అల్లుకున్న పొదరిల్లులాంటి జీవితాలలో
బంధకాలనైనా ఎదిరించే బంధాలు హరివిల్లులాగా
ఆప్యాయతలతో వెలుగుతుంటే
పరిచయమే లేని ఓ అనర్థం
యుద్ధం రూపంలో
శాంతి సమాధానాలను సవాలు చేస్తూ రక్తపు మరకలతో మరో చరిత్ర రాస్తోంది!
చిదిమివేయబడిన చిరు నవ్వులు చిన్నబోతున్నాయి
చితికిపోయిన బ్రతుకులు ఒంటరిగా మిగులుతున్నాయి
బలైపోయిన మనుషులు సమాధిలో జ్ఞాపకాలుగా నిలిచిపోతున్నారు
అర్థంలేని అహంకారపు వేగానికి
అదుపులేని మూర్ఖుల గర్వానికి
ఎలా బుద్ధి చెప్పాలో...
నేలతల్లి కారుస్తున్న రక్తపు కన్నీరును తుడిచి ఎలా ఓదార్చాలో తెలియడం లేదు..
దూసుకుపో
చీల్చుకుపో
పేల్చుకుపో
అని చెప్పి మరి పోషిస్తుంటే
నువ్వు మాత్రం ఏమి చేయగలవు?
నువ్వు చూడలేవు
చూసినా ఆపలేవు
ఎందుకంటే...
అందరం అనే అర్ధం నీకు తెలియదు
నీతో మాట్లాడుతున్న నేను ఒంటరిని కాదు!
No comments:
Post a Comment