Saturday, 30 August 2025

అమ్మ మరిచిన ప్రేమపాశం

 శీర్షిక : అమ్మే మరిచిన ప్రేమపాశం


నేను చేసిన నేరమేమిటమ్మా? 

నవ మాసాలు మోసిన నీకే భారమైతిని


నేను చేసిన పాపమేమిటమ్మా? 

నను మురిపించే నీ ఒడికే దూరమైతిని


ఆలుమగల వలపు ఆటలో పూసిన పువ్వునే కదమ్మా ? 

అసహ్యానికి నేను ఎట్లు కారణమైతిని? 


కన్నీరుకే తల్లడిల్లే తల్లివే కదమ్మా

చనుపాలు తాగిన బిడ్డడు పై ఎలా కన్నెర్ర చేసితివి



శరీరేచ్ఛల దాడిలో నీవు భాగమైతివో లేక బానిసవైతివో

కఠినమైన నిర్ణయంతో నన్నే 

మరణ కౌగిలికి అప్పగించేస్తివి



నేను చేసిన నేరమేమిటమ్మా? 

నేను చేసిన పాపమేమిటమ్మా?

ఒక రోజు

 ఓ నేస్తమా !


రోజన్నది చిన్నదికాదు కనులు మూసుకొని మరిచిపోడానికి 


రోజన్నది అంతము కాదు

ఆశలతో సాగకుండ ఆగిపోడానికి


రోజన్నది ఓ అయోమయం

భయంలోనే బ్రతికే వాడికి


రోజన్నది ఓ అవకాశం

ప్రయత్నించాలనుకునే వాడికి


రోజన్నది ఓ ఆయుధం 

కొత్తగా నేర్చుకుంటున్న వాడికి


రోజన్నది ఓ అద్భుతం

పోరులో నిలచి గెలిచే వాడికి


నేర్చుకున్నది ఎంతని 

ప్రశ్నించుకునే వాడు

నేర్చుకోవాల్సింది చాలానే

ఉందని గ్రహించిన వాడు


అయోమయాన్ని వదిలి

అవకాశాన్ని చూస్తాడు

ఆయుధాన్ని చేపట్టి

అద్భుతాన్ని సృష్టిస్తాడు 


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079

నీడ

 మనల్ని విడనాడని

ప్రియనేస్తమే నీడ

ముందు నేనున్నా

భయపడకంటుంది

వెనకనే నేనుంటా

ఆగకని చెప్తుంది

అంతా బాగుంటే

లోలోనే ఉంటుంది



బలాన్ని పరిచయం

చేసే జ్ఞానిలాంటిది

బలుపుతో ఎగిరిపడితే 

గాలి తీసే సూదిలాంటిది


నీడ కూడ నిలదీస్తోంది

గురువుల గుణమే-గౌరవ నిలయం

 తపస్వి మనోహరం పత్రిక కవితల పోటీల కొరకు... 


అంశం:- ఉపాధ్యాయులు


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు: కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక:-

గురువుల గుణమే-గౌరవ నిలయం



చింతలు చిరాకులు చెంతనున్నా

చిరు దరహాసంతో ప్రేమానురాగాలు

కురిపించగల దయా హృదయులు "గురువులు"


విలువలు మరిచి వ్యవహరించే

నవనిర్మాణికుల పాలిట హద్దుమీరని బెత్తమై 

దండించగల  జీవితపు శిల్పులు "గురువులు"


అక్షరయజ్ఞంలో సమానత్వమును

సామరస్యమును సూత్రాలుగా ఆదరించి నిష్టగా ఆచరించగల  ప్రధాన అర్చకులు "గురువులు"


పేగు బంధమే లేని చిన్నారులతో

అమ్మ ప్రేమలా వింతగా అల్లుకొని

నడిపించగల దైవాంశ సంభూతులు "గురువులు"


సమస్యల తాలుకు చర్యలకు సడలక బెదరక వివేకముతో శాంతిని సమాధానాన్ని జోడించగల

మేథాసంపన్నులు "గురువులు"


అజ్ఞానం కమ్మిన చీకటి బ్రతుకులలో

అర్ధవంతమైన అనుకూల ఆలోచనలను వెలిగించగల జ్ఞాన జ్యోతులు "గురువులు"


గురువుల గుణమే-గౌరవ నిలయం

గురువుల రణమే-అనిర్వచనియం


✍️అనిర్వ✍️ (కలం పేరు) 

@ప్రేమ్ సాగర్ కోటపూరి


ఇది నా స్వీయ రచన, ఈ పోటీ కొరకు రాయబడినది.


@ ప్రేమ్ సాగర్ కోటపూరి

9542000079

Monday, 18 August 2025

ప్రతిసారి...చివరిసారి

 అనంత సాహితీ వేదిక

18/08/2025

అంశం : చివరిసారిగా


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా


శీర్షిక : ప్రతిసారి...చివరిసారి



అలవాటులో పొరపాటుగా చేసే అప్పులకు తప్పులకు హామీ ఇచ్చేలా చెప్పే ప్రియమైన మాట

ఇదే చివరిసారని ఇకమీదట చేయబోనని... 


మనిషి ఒక ఆశాజీవి - ఆకలికి అల్లాడి పోతాడు - ఆశలకి అతుక్కుపోతాడు - అవమానానికి రేగిపోతాడు - అభిమానానికి ఊగిపోతాడు... 


బాధ ఏదైన భారం ఎంతైనా

పడుతూ లేస్తూనే ధీమాకే భీమాల సాగిపోతాడు... 


పాపం మనిషి - అంతా నాదని అనుకునే లోపు ఏమిలేకుండా మిగిలిపోతాడు - ఏమి లేదని చింతించే స్థితిలో అన్నీ క్రమంలో 

పొందుకుంటూంటాడు - అదే ఊపులో పోగొట్టుకుంటూంటాడు... 


ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి ఇదే చివరిసారి కావాలని వేడుకుంటూ పొడుకుంటాడు - తిరిగి లేచి బ్రతుకు పోరులో పరిగెడుతూనే ఉంటాడు - నవ్వినా ఏడ్చినా వచ్చే కన్నీళ్ళ మధ్య నలిగిపోతుంటాడు..


చివరి శ్వాస విడిచే దాక - చిరునవ్వుని ముసుగుగా వేసుకొని మూరిసిపోతుంటాడు - మాటలతో మాయలే చేస్తూ ప్రతిసారి చివరిసారని - లోకతీరునే అనుసరిస్తూ బ్రతికేస్తూంటాడు... 


 


✍️అనిర్వ✍️( కలం పేరు) 

@ ప్రేమ్ సాగర్ కోటపూరి

9542000079

నాటి నైజం లేదిక్కడ!

 రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079



శీర్షిక: నాటి నైజం లేదిక్కడ! 



నాడు స్వేచ్ఛా జీవిని

స్వచ్ఛతకు సాక్షిని

ప్రేమకు అర్హుడిని

స్నేహనికి ఆధారాన్ని

అభిమానానికి ఆలోచనని

ఆత్మీయతకు ఆరాటాన్ని

బాధ్యతకు సైనికుడిని

భరోసాకు నాయకుడిని


సమాజ హితముకై 

నేడు ఓ సమీదనై


గుర్తు చేస్తున్నా గతాన్ని

వినిపిస్తూ నా గళాన్ని...



అవసరాల వేటలో 

అల్లాడి పోతున్నా

అభాగ్యుల గాధ వింటున్నా! 


అభివృద్ధి మోజులో పడి 

నలిగిపోతున్న అవివేకుల జాడ చూస్తున్నా!



పచ్చ తోరణాల పట్టు చీర చుట్టిన

అడివితల్లి అందమెక్కడా? 

అద్దెలిచ్చి హద్దు లెట్టుకున్న పార్కులలో సందడే ముద్దు ఇక్కడ! 


అలవాట్లే ఆరోగ్యంగా గడిపిన

ఆ ఆనందమెక్కడా? 

ఆస్తులమ్ముకుని సేద తీరే

ఆసుపత్రుల గోలే ఇక్కడ!


అరుగులెంట పొరుగువారితో 

కోసుకున్న పంట లెక్కడా? 

అరగంట కూడ ఓపిక పట్టలేని

చరవాణి చెరలోని తరములిక్కడ! 


గురువుల సేవలో నేర్చిన 

సంస్కారాల చదువులెక్కడా? 

కాసుల త్రాసులో వ్రేలాడే 

చిల్లర సుంటలే ఇక్కడ!


సమస్యల భారాన్ని తలదన్నే

సన్నిహితుల తోడెక్కడా? 

అరువులిచ్చి అస్తమిస్తున్నా 

చెలిమి తాలుకు చితులే ఇక్కడ! 


కంచాలు మంచాలే లేని ఆకలి నిద్రలు తీరిన వారెక్కడా? 

హంగుల విందుల చిందులలో 

అజ్ఞానపు అర్ధనగ్న చిత్రాలే ఇక్కడ!


ఆత్మాభిమానంతో పేదరికాన్నే 

ఎదిరించిన తలిదండ్రులెక్కడా? 

ముదిమి చాయల వంచనలో

ఆశ్రమ ఆశ్రయాల ప్రేమలే ఇక్కడ!



మాటే మంత్రంగా మమతే ప్రాణంగా  

మసులుకున్న తీరెక్కడా? 

అడ్డదారి హెచ్చులలో చిక్కి 

చంపుకునే జీవనశైలిక్కడ!



ఉన్నంతలో కొండంతగా 

చాటిన మానవత్వమెక్కడా? 

సంపదకై పోటీతత్వంలో 

సాటితత్వమే మరిచే మనుషులిక్కడ!



ఎందుకోసమని ఆరాటం 

ఏమున్నదని ఆర్భాటం

ఎంత ఎత్తు ఎగిరిన

ఆరడుగుల శూన్యంలో

చేధించలేము మరణాన్ని! 


@ప్రేమ్ సాగర్ కోటపూరి

✍️అనిర్వ✍️(కలం పేరు)